Women's Big Bash League: మహిళల బిగ్‌బాష్‌లో అరుదైన ఘటన: ఒక్క బంతి ఎదుర్కోకుండానే డాటిన్ ఔట్
డాటిన్ ఔట్

Women's Big Bash League: మహిళల బిగ్‌బాష్ లీగ్ (WBBL)లో క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన చోటుచేసుకుంది. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే ‘ఫ్రీ బాల్ బౌల్డ్ ఔట్’ రూపంలో వికెట్ కోల్పోయింది. బిగ్‌బాష్ చరిత్రలో (పురుషులు, మహిళలు కలిపి) ఈ తరహాలో ఔటైన తొలి క్రికెటర్‌గా ఆమె నిలిచింది.
బుధవారం జంక్షన్ ఓవల్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది. హీట్ నిర్దేశించిన 138 పరుగుల ఛేదనలో రెనెగేడ్స్ 15వ ఓవర్‌లో 97/4 వద్ద ఉండగా డాటిన్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చింది. WBBL నిబంధనల ప్రకారం ఒక బ్యాటర్ ఔటయ్యాక కొత్త ప్లేయర్ 75 సెకన్లలోపు క్రీజులోకి రావాలి. ఆలస్యమైతే బౌలర్‌కు ఫ్రీ బాల్ అవకాశం లభిస్తుంది.
డాటిన్ హెల్మెట్, గ్లవ్స్ సర్దుబాటు చేసుకుంటూ ఆలస్యంగా వచ్చింది. అంపైర్లు ఆమెను క్రీజు నుంచి ఐదు మీటర్ల దూరంలో (లెగ్ సైడ్) నిలబెట్టారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ సారా గ్లెన్ బంతిని నేరుగా అన్‌గార్డెడ్ స్టంప్స్‌పైకి విసిరింది. బంతి మిడిల్-లెగ్ స్టంప్స్‌ను తాకడంతో డాటిన్ బౌల్డ్ అయింది. స్కోర్‌కార్డులో ఆమె ఒక బంతి ఎదుర్కొని సారా గ్లెన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయినట్లు నమోదైంది.
ఈ నిబంధన 2021-22 సీజన్ నుంచి ఆట వేగాన్ని పెంచేందుకు అమలులోకి వచ్చింది. గ్లెన్ వికెట్ తీసిన తర్వాత మొదట ఆశ్చర్యపోయి నవ్వుకుంది. ఆ తర్వాత జట్టు సభ్యులు ఆమెను చుట్టుముట్టారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెనెగేడ్స్ కెప్టెన్ సోఫీ మోలిన్యూక్స్ “క్రికెట్‌లో ఇలాంటిది ఇంతకుముందు చూడలేదు” అని అన్నారు.
డాటిన్ వికెట్ కోల్పోయినప్పటికీ రెనెగేడ్స్ చివరి బంతికి 138 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్ల తేడాతో ఛేదించి విజయం సాధించింది. టాప్ ఫోర్ ఆశలు నిలిపుకుంది. ఈ అరుదైన డిస్మిసల్ క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

