Rashid Khan: క్రికెట్ ప్రపంచంలో మాయా స్పిన్నర్‌గా, టీ20 స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్.. తాజాగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. కోట్లు కురిపించే ఆఫర్లు, ప్రపంచ దేశాల పౌరసత్వం.. ఇవేవీ తన దేశభక్తి ముందు సరిపోవని ఆయన నిరూపించారు. తాజాగా విడుదలైన తన పుస్తకంలో రషీద్ వెల్లడించిన విషయాలు ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్‌గా మారాయి.

అగ్రరాజ్యాలైన భారత్, ఆస్ట్రేలియా దేశాలు తనకు పౌరసత్వం (Citizenship) ఇస్తామని ఆఫర్ చేశాయని, కానీ తాను వాటిని సున్నితంగా తిరస్కరించానని రషీద్ ఖాన్ వెల్లడించారు. ఆయా దేశాల తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం వచ్చినా.. కేవలం తన మాతృభూమి కోసం ఆడేందుకే మొగ్గు చూపినట్లు ఆయన పేర్కొన్నారు. "నేను నా దేశం కోసం తప్ప, వేరే ఏ దేశం కోసం ఆడను" అని ఆయన తన పుస్తకంలో స్పష్టం చేశారు.

ముఖ్యంగా 2023 ఐపీఎల్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను రషీద్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో భారత క్రికెట్ బోర్డుకు చెందిన ఒక ఉన్నతాధికారి రషీద్‌ను కలిసి.. టీమ్ ఇండియా తరపున ఆడేలా భారత పౌరసత్వం ఇస్తామని ప్రతిపాదించారట. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బోర్డు నుంచి వచ్చిన ఆ ఆఫర్‌ను కూడా రషీద్ కాదనుకున్నారు. తన సొంత దేశం ఆఫ్ఘనిస్తాన్‌కు కీర్తి ప్రతిష్టలు తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన చాటిచెప్పారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం, అశాంతి నెలకొన్నప్పటికీ.. రషీద్ ఖాన్ తన పట్టుదలను వీడలేదు. ఎన్నో ఇబ్బందుల మధ్య ఎదిగిన ఆయన, నేడు ప్రపంచ క్రికెట్‌లో టాప్ ప్లేయర్‌గా నిలిచారు. పౌరసత్వం మార్చుకుంటే మరిన్ని సౌకర్యాలు, సెక్యూరిటీ లభించినప్పటికీ.. వాటన్నింటినీ వదులుకొని తన దేశ జెండా కోసమే పోరాడుతున్నారు. రషీద్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story