Afghanistan - Bangladesh T20 Match: రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలం.. ఉత్కంఠపోరులో బంగ్లాదేశ్ విన్
ఉత్కంఠపోరులో బంగ్లాదేశ్ విన్

Afghanistan - Bangladesh T20 Match: ఆఫ్ఘనిస్తాన్ - బంగ్లాదేశ్ మధ్య షార్జా వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ (40), మొహమ్మద్ నబీ (38) మాత్రమే చెప్పుకోదగిన స్కోర్లు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్, రిషద్ చెరో 2 వికెట్లు తీయగా, తస్కిన్, నసుమ్, ముస్తాఫిజుర్ తలో వికెట్ పడగొట్టారు.
రషీద్ ఖాన్ మ్యాజిక్
152 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. తంజిద్ (51), పర్వేజ్ ఎమోన్ (54) అర్ధ సెంచరీలతో మెరిసి, తొలి వికెట్‌కు 109 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ రంగంలోకి దిగి తన స్పిన్ మాయాజాలంతో బంగ్లాదేశ్‌ను ఒక్కసారిగా వణికించాడు. రషీద్ కేవలం 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడంతో బంగ్లాదేశ్ 8 పరుగుల వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
బంగ్లాదేశ్‌కు ఉత్కంఠ విజయం
ఒకానొక దశలో బంగ్లాదేశ్ పరాజయం అంచున ఉన్నట్లు కనిపించినా.. ఆఖర్లో నూరుల్ హసన్ (23 నాటౌట్), రిషద్ హొసేన్ (14 నాటౌట్) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. బంగ్లాదేశ్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
