Ravichandran Ashwin: విరాట్ కోహ్లీ ఆటపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ..
అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ..

Ravichandran Ashwin: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వడోదర వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో కివీస్ విధించిన 301 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
తృటిలో తప్పిన సెంచరీ.. కానీ రికార్డుల మోత
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం 91 బంతుల్లో 93 పరుగులు చేసి దుమ్మురేపారు. దురదృష్టవశాత్తు సెంచరీకి 7 పరుగుల దూరంలో అవుటైనప్పటికీ, ఈ ఇన్నింగ్స్‌తో ఆయన పలు అరుదైన మైలురాళ్లను అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్‌కు ఇది వరుసగా ఏడో 50+ స్కోరు కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ అధిగమించారు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించారు.
అశ్విన్ ఏమన్నారంటే?
విరాట్ ఫామ్‌పై టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో ప్రశంసలు కురిపించారు. "ప్రస్తుతం విరాట్ మైండ్‌లో బ్యాటింగ్ తప్ప మరో ఆలోచన లేదు. ఆయన తన చిన్నతనంలో ఎంత సరదాగా, ఏ యాటిట్యూడ్‌తో క్రికెట్ ఆడేవారో.. ఇప్పుడూ అదే ఉత్సాహంతో కనిపిస్తున్నారు. దానికి ఆయన ఏళ్ల అనుభవం తోడవ్వడం వల్ల ప్రత్యర్థి బౌలర్లకు దొరకడం లేదు" అని అశ్విన్ కొనియాడారు.
శ్రేయస్ అయ్యర్ సక్సెస్‌ఫుల్ కమ్‌బ్యాక్
గాయం కారణంగా కొన్ని నెలల పాటు ఆటకు దూరమైన వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఈ మ్యాచ్‌తో అదిరిపోయే పునరాగమనం చేశారు. కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అయ్యర్, 47 బంతుల్లో 49 పరుగులు చేశారు. అయ్యర్ ఆటతీరుపై స్పందిస్తూ.. "శ్రేయస్ వన్డేల్లో చాలా నిలకడైన ఆటగాడు. జెమీసన్ వేసిన మంచి బంతికి ఆయన అవుటయ్యారు. అయితే కమ్‌బ్యాక్ మ్యాచ్‌లోనే అంతటి ఆత్మవిశ్వాసంతో ఆడటం గమనార్హం" అని అశ్విన్ అన్నారు.

