Mohammed Shami: నా దేశం కోసం దేనికైనా సిద్ధం'.. సెలెక్టర్లకు షమీ స్ట్రాంగ్ మెసేజ్!
సెలెక్టర్లకు షమీ స్ట్రాంగ్ మెసేజ్!

Mohammed Shami: భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ టీమ్ ఇండియాలోకి తన పునరాగమనంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా గాయాలు, సర్జరీల వల్ల జట్టుకు దూరమైన ఈ 35 ఏళ్ల స్పీడ్‌స్టర్, ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్నారు. తాజాగా 'న్యూస్ 18 రైజింగ్ భారత్ సమ్మిట్ 2026'లో పాల్గొన్న షమీ, సెలెక్టర్లకు మరియు బీసీసీఐకి తన మనసులోని మాటను స్పష్టంగా వినిపించారు.
"మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ క్రీడ ఆడినా.. మీలో సత్తా ఉన్నంత వరకు దాన్ని వృథా చేయకండి. నా ట్యాంక్‌లో ఇంకా ఇంధనం ఉంది. ఆ చివరి చుక్క వరకు దేశం కోసం పోరాడటమే నా లక్ష్యం" అని షమీ ఉద్వేగంగా మాట్లాడారు. తన సామర్థ్యంలో కొంచెం కూడా వృథా చేయకూడదని, రిటైర్మెంట్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఎలాంటి పశ్చాత్తాపం ఉండకూడదని ఆయన చెప్పుకొచ్చారు.
గాయం నుంచి కోలుకున్నాక బెంగాల్ తరపున రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో షమీ నిప్పులు చెరుగుతున్నారు. జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 8/90 గణాంకాలతో కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌ల్లో 36 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ, ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా పర్యటన మరియు స్వదేశీ సిరీస్‌లకు షమీని పక్కన పెట్టడం గమనార్హం.
ఫిట్‌నెస్ గురించి వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. "నేను ఫిట్‌గా ఉన్నాను, నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నాను. మైదానంలో నా ప్రదర్శన కొనసాగుతూనే ఉంటుంది, మిగతాది సెలెక్టర్ల చేతుల్లో ఉంది" అని షమీ స్పష్టం చేశారు. కేవలం మాటలతో కాకుండా వికెట్లతో సమాధానం చెబుతున్న షమీని చూస్తుంటే, త్వరలోనే ఆయన మళ్ళీ నీలి రంగు జెర్సీలో కనిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

