Justice Navinirao : హెచ్‌సీఏ పర్యవేక్షకుడిగా రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావు
సీఐడీ అదుపులో హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజు…?

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ సంస్ధ పర్యవేక్షణ బాధ్యతలను రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావుకు తెలంగాణ హైకోర్టు అప్పగించింది. హెచ్‌సీఏ లో అక్రమాలకు పాల్పడటంతో పాటు ఫోర్జరీ, బ్లాక్‌మెయిలింగ్ కేసుల్లో ఆ సంస్ధ అధ్యక్షుడు జగన్మోహనరావుతో పాటు కార్యవర్గంలో చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరంతా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ పరిస్ధితుల్లో హెచ్‌సీఏ కార్యకలాపాలు స్ధంభించకుండా ఉండేదుకు, ఎటువంటి అవకతవకలు జరగుండా చూసేందుకు పర్యవేక్షకుడిగా రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావును తెలంగాణ హైకోర్టు నియమించింది. జస్టిస్ నవీన్ రావు అనుమతి లేకుండా ఏదీ చేయవద్దని, ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని అదేశించింది. 2007 నుంచి హెచ్‌సీఏలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని సఫిల్‌గూడా క్రికెట్ క్లబ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ నెల 19వ తేదీన జరిగిన హెచ్‌సీఏ 87వ ఏజీఎం కొనసాగింపును పిటీషనర్ తప్పుబట్టారు. పది రోజుల నోటీసు సమయం లేకుండా ఏజీఎం నిర్వహించడం పట్ల పిటీషనర్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతివాదులుగా సీబీఐ, బీసీసీఐ, హెచ్‌సీఏలను చేరుస్తూ సఫిల్‌గూడా క్రికెట్ క్లబ్ పిటీషన్ దాఖలు చేసింది. సఫిల్‌గూడా క్రికెట్ క్లబ్ వేసిన పిటీషన్ పై సోమవారం హైకోర్టు పూర్తి స్ధాయి విచారణ చేపట్టే అవకాశం ఉంద.
ఇదిలా ఉండగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలలో ఏ-2 నిందితుడిగా ఉన్న ఆర్. దేవరాజు ను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. కేసులో జగన్ మోహన్ రావు తర్వాత కీలక నిందితుడిగా దేవరాజు ఉన్నారు. హెచ్ సీ ఏ చైర్మన్ జగన్ మోహన్ రావు సహా పలువురు నిందితులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అయితే అరెస్ట్ సమాచారాన్ని ముందే తెలుసుకున్న దేవరాజు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి సిఐడి పోలీసులు అతనికోసం వెతుకుతున్నారు. అరెస్టు లపై ముందుగా సమాచారాన్ని లీక్ చేసి దేవరాజు పారిపోయేందుకు సహరించాడనే ఆరోపణలతో ఇటీవల ఉప్పల్ ఎస్‌హెచ్‌ఓ ఎలక్షన్ రెడ్డి పై రాచకొండ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఆయనను సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. తాజాగా దేవరాజును సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా సిఐడి అధికారులు ధృవీకరించలేదు.
