Rinku Singh: రింకూ సింగ్ కు సర్కార్ కొలువు.!
సర్కార్ కొలువు.!

Rinku Singh: ఆల్ రౌండర్ రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఖరారైనట్లు సమాచారం. యూపీ ప్రభుత్వం ఆయన్ను రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ జట్టుకు ఆయన చేస్తున్న సేవలు, నిబద్ధతకు గుర్తింపుగా ఈ అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పోస్టు యూపీలో గ్రూప్-A కిందికి వస్తుంది. జీతం, అలవెన్సులతో కలిపి రూ.56 వేల100 నుంచి రూ.లక్షా 77 వేల 500 చేతికి అందుతుంది.
రింకూ ప్రయాణం పూల బాట కాదు. అలీగఢ్‌లోని ఒక సామాన్య కుటుంబం.. తండ్రి గ్యాస్ సిలిండర్లు మోసేవారు.. అన్నయ్య ఆటో తోలేవాడు. ఒకానొక సమయంలో కోచింగ్ సెంటర్లో తుడుచుకునే పని దొరికితే.. తన కలను చంపుకోలేక ఆ పనిని కాదనుకున్న పట్టుదల అతనిది. తిండికి తిప్పలున్నా, చేతిలో నాణ్యమైన బ్యాట్ లేకపోయినా.. తనలోని కసిని మాత్రం కోల్పోలేదు.
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున అద్భుతాలు సృష్టించి.. టీమ్ ఇండియా నీలి రంగు జెర్సీని ధరించి.. ఈరోజు ఏకంగా గెజిటెడ్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో రింకూను ఈ కీలక పదవికి ఎంపిక చేసింది.ఈ ఉద్యోగం కేవలం రింకూ వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.. కష్టపడితే ఆకాశమే హద్దు అని నమ్మే లక్షలాది మంది యువ క్రీడాకారులకు ఒక గొప్ప భరోసా. మైదానంలో సిక్సర్లతో ప్రత్యర్థులను వణికించే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఇప్పుడు ఆఫీసర్ హోదాలో క్రీడారంగాన్ని మరింత ముందుకు నడిపించబోతున్నారు.

