పద్మశ్రీ!

Rohit Sharma and Harmanpreet Kaur: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో క్రీడా రంగానికి చెందిన ప్రముఖులకు సమున్నత గౌరవం దక్కింది. భారత పురుషుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 'పద్మశ్రీ' పురస్కారానికి ఎంపికవ్వగా, టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ దేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం 'పద్మభూషణ్'కు ఎంపికయ్యారు. 2026 ఏడాదికి గానూ పద్మభూషణ్ పొందిన ఏకైక క్రీడాకారుడు అమృత్‌రాజ్ కావడం విశేషం.

వీరితో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, భారత మహిళల హాకీ జట్టు గోల్ కీపర్ సవితా పునియా, బల్దేవ్ సింగ్, భగవాన్‌దాస్ రైక్వార్, కె. పజనివేల్ కూడా పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. మాజీ కుస్తీ శిక్షకుడు వ్లాదిమిర్ మెస్ట్‌విరిష్విలికి మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు. 1983లోనే పద్మశ్రీ అందుకున్న 72 ఏళ్ల విజయ్ అమృత్‌రాజ్, తన కెరీర్‌లో వింబుల్డన్,యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకుని భారత టెన్నిస్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు.

క్రికెట్ విషయానికొస్తే, రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అటు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. నవంబర్ 2025లో దక్షిణాఫ్రికాను ఓడించి, తొలిసారిగా వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ అద్భుత విజయాలను సాధించినందుకు గానూ కేంద్ర ప్రభుత్వం వీరిద్దరినీ పద్మశ్రీతో గౌరవించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story