సెంచరీతో సరికొత్త రికార్డు!

Rohit Sharma: సుదీర్ఘ విరామం తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా స్టార్ బ్యాటర్, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బుధవారం (డిసెంబర్ 24) సిక్కింతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో రోహిత్ కేవలం 62 బంతుల్లోనే సెంచరీ బాది అభిమానులను ఉర్రూతలూగించారు. సుమారు 7 ఏళ్ల తర్వాత ముంబై తరపున బరిలోకి దిగిన రోహిత్, తన రాకను ఘనంగా చాటుకుంటూ ఈ ఘనత సాధించారు.

ఈ క్రమంలో రోహిత్ తన పాత రికార్డును తానే తిరగరాశారు. గతంలో 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 63 బంతుల్లో చేసిన సెంచరీ ఇప్పటివరకు ఆయన వేగవంతమైన శతకం. తాజాగా 62 బంతుల్లోనే ఆ మార్కును అందుకోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తం 94 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 18 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 155 పరుగులు సాధించి అజేయంగా నిలిచారు. రోహిత్ వీరబాదుడుతో ముంబై జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు సమం: ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక సార్లు 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రోహిత్ సమం చేశారు. వార్నర్ తన కెరీర్‌లో 210 మ్యాచ్‌ల్లో తొమ్మిది సార్లు 150+ స్కోర్లు సాధించగా, రోహిత్ ఇప్పుడు తన 9వ 150+ స్కోరును నమోదు చేశారు. రోహిత్ సాధించిన ఈ తొమ్మిదింటిలో 8 భారత్ తరపున అంతర్జాతీయ వన్డేల్లో రాగా, ఒకటి ముంబై తరపున విజయ్ హజారే ట్రోఫీలో నమోదైంది.

వయసులోనూ రికార్డు: 38 ఏళ్ల 238 రోజుల వయసులో సెంచరీ సాధించిన రోహిత్, విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచారు. బెంగాల్‌కు చెందిన అనుస్తుప్ మజుందార్ (39 ఏళ్లు పైబడి) ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా ఉన్న రోహిత్, తన ఫామ్ ఏమాత్రం తగ్గలేదని ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో మరోసారి నిరూపించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story