Ravichandran Ashwin: భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్ అనంతరం వారి కోచింగ్ భవిష్యత్తుపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన వెంటనే విరాట్ కోహ్లీ కోచింగ్ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండకపోవచ్చని, కానీ ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మ ఆటను విడిచిపెట్టిన వెంటనే ఆయన సేవలను ఏదో ఒక హోదాలో వినియోగించుకోవాలని అశ్విన్ సూచించారు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్.. "విరాట్ కోహ్లీ ఆట నుంచి తప్పుకున్న వెంటనే కోచ్ కావడానికి సిద్ధపడతాడని నేను అనుకోవడం లేదు. ఇద్దరూ ఎంతో కష్టపడ్డారు. నా అంచనా ప్రకారం విరాట్ కొంతకాలం క్రికెట్ నుండి విరామం (బ్రేక్) తీసుకోవాలని కోరుకోవచ్చు. కానీ రోహిత్ శర్మ విషయాన్ని పరిశీలిస్తే, అతడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలోకి ఏదో ఒక హోదాలో వచ్చే అవకాశం ఉంది" అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఫ్రాంచైజీ క్రికెట్ మరింత విస్తరించనుండటంతో మెంటార్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, హై-పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ వంటి ప్రత్యేక పాత్రలకు భారీ డిమాండ్ ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో ఉన్న రోహిత్ శర్మ తన కెరీర్ చివరి దశకు చేరుకున్నారు. ఇప్పటికే టీ20, టెస్టు క్రికెట్లకు వీడ్కోలు పలికిన ఆయన త్వరలోనే మిగిలిన ఫార్మాట్లకు కూడా గుడ్‌బై చెప్పే అవకాశాలున్నాయి. అయితే, ముంబైకి 5 ఐపీఎల్ ట్రోఫీలు, భారత జట్టుకు ఐసీసీ కప్‌లు అందించిన రోహిత్ శర్మ లాంటి వ్యూహాత్మక దిగ్గజాన్ని రిటైర్మెంట్ తర్వాత ఊరికే వదిలేయకూడదని అశ్విన్ ముంబై ఇండియన్స్‌కు సూచించారు.

"ఒకవేళ రేపు రోహిత్ శర్మ నేను ఇక ఆడనని నిర్ణయించుకుంటే, ముంబై ఇండియన్స్ వెంటనే అతడిని తమ సెటప్‌లోకి తీసుకోవాలి. 5 టైటిళ్లు గెలిపించి, దేశానికి వరల్డ్ కప్ అందించిన అలాంటి నాయకుడు మళ్లీ దొరకడు. హెడ్ కోచ్ పాత్ర ఎంతో శ్రమతో కూడుకున్నది కాబట్టి ఒకవేళ ఆయన ఆ పదవికి వద్దనుకున్నా, రాహుల్ ద్రవిడ్ లాగా ఒకటి లేదా రెండేళ్ల విరామం తీసుకున్న తర్వాత మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. రోహిత్ లాంటి క్రికెటింగ్ బ్రెయిన్ ఉన్న ఆటగాడిని ముంబై ఇండియన్స్ అంత సులువుగా వదులుకోదని నాకు తెలుసు" అని అశ్విన్ వెల్లడించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story