Sairaj Bahutule: టీమిండియా స్పిన్ విభాగానికి కొత్త గురువు వచ్చేశారు! భారత జాతీయ పురుషుల క్రికెట్ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే నియమితులయ్యారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీమిండియా స్పిన్ అటాక్‌ను మరింత పటిష్టం చేసేందుకు బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్ తరపున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడిన 53 ఏళ్ల సాయిరాజ్ బహుతులే.. దేశవాళీ క్రికెట్‌లో ఒక దిగ్గజం. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 630 వికెట్లు పడగొట్టడమే కాకుండా, బ్యాట్‌తోనూ 6,176 పరుగులు సాధించిన అద్భుతమైన ట్రాక్ రికార్డు ఆయన సొంతం. రిటైర్మెంట్ తర్వాత కోచింగ్‌లో తనదైన ముద్ర వేసిన బహుతులే.. గతంలో విదర్భ, కేరళ, గుజరాత్, బెంగాల్ వంటి బలమైన దేశవాళీ జట్లకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు.

ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు స్పిన్ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఆయనకుంది. అంతేకాదు, 2021 నుంచి 2024 మధ్య కాలంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) లోనూ సేవలు అందించారు. ముఖ్యంగా 2022లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టుకు ఆయనే బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించడం విశేషం. భారత జట్టుకు కోచ్‌గా సేవలందించే అవకాశం రావడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు బహుతులే ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

ఇక సాయిరాజ్ బహుతులేకు మొదటి అసైన్‌మెంట్ కూడా ఫిక్స్ అయిపోయింది. జూన్ 6 నుంచి ముల్లాన్‌పూర్‌లో అఫ్గానిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌తో ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ మ్యాచ్‌లో మానవ్ సుతార్, హర్ష్ దూబే వంటి యువ స్పిన్నర్లకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు. మరి బహుతులే ఆధ్వర్యంలో మన టీమిండియా స్పిన్నర్లు ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి!

PolitEnt Media

PolitEnt Media

Next Story