Sarfaraz Scores Century: సర్పరాజ్ సెంచరీ..టీమిండియాలో చోటు దక్కేనా.?
టీమిండియాలో చోటు దక్కేనా.?

Sarfaraz Scores Century: టీమిండియా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ బుచ్చి బాబు ట్రోఫీలో సెంచరీ సాధించి అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. ముంబై తరపున టీఎన్‌సీఏ ఎలెవన్ జట్టుపై 114 బంతుల్లో 138 పరుగులు (10 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కేవలం 92 బంతుల్లోనే తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
ఈ ఇన్నింగ్స్‌లో ముంబై 98 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్, అకాష్ పార్కర్‌తో కలిసి వందకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ సెంచరీతో భారత సెలెక్టర్లకు తన సత్తా ఏంటో మరోసారి చాటి చెప్పాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్‌కు ఇది 16వ శతకం. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, టెస్టు జట్టులో స్థానం దక్కించుకోవడం అతనికి కష్టంగా మారింది. ముఖ్యంగా అతను ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఇటీవల సర్ఫరాజ్ దాదాపు 17 కిలోల బరువు తగ్గించుకుని ఫిట్‌గా మారాడు. ఈ సెంచరీతో రాబోయే దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు తనను పరిగణనలోకి తీసుకోవాలని సెలెక్టర్లకు బలమైన సంకేతం పంపించాడు.
2024 ఫిబ్రవరి 15 రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ ల్లో హాఫ్ సెంచరీలు చేసి సత్తా చాటాడు. ఓవరాల్ గా ఆరు టెస్టుల్లో ఇండియా తరపున 371 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ తన చివరి టెస్టును గత ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XIతో ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సర్ఫరాజ్ ఎంపికైనా ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు.
