World Badminton Championships: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సంచలనం: పతకం ఖాయం చేసిన ట్రీసా - గాయత్రి జోడీ!
పతకం ఖాయం చేసిన ట్రీసా - గాయత్రి జోడీ!

World Badminton Championships: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది! వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మన స్టార్ షట్లర్లు ట్రీసా జాలీ - గాయత్రి గోపీచంద్ జోడీ సంచలన విజయం సాధించి, దేశానికి పతకాన్ని ఖాయం చేసింది.
చైనాకు చెందిన బలమైన ప్రత్యర్థులు, నాల్గో సీడ్ జియా యి ఫాన్ - జాంగ్ షు జియాన్‌లతో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరు నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించింది. తొలి గేమ్‌ను 16-21తో కోల్పోయినప్పటికీ, మన అమ్మాయిలు ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కేవలం పోరాడటమే కాదు.. రెండో గేమ్‌లో 21-15తో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో అయితే చైనా జోడీకి చుక్కలు చూపించారు. అటాకింగ్ గేమ్‌తో విరుచుకుపడి 21-13తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకున్నారు. సరిగ్గా గంటా పది నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో ట్రీసా, గాయత్రి ప్రదర్శించిన తెగువ నిజంగా ప్రశంసనీయం!
ఈ విజయంతో విమెన్స్ డబుల్స్‌లో భారత్‌కు ఏళ్ల తర్వాత పతక ఆశలు నెరవేరాయి. చివరగా 2011లో లండన్ వేదికగా జ్వాలా గుత్తా - అశ్విని పొన్నప్ప జోడీ బ్రాంజ్ మెడల్ సాధించగా.. ఇప్పుడు దశాబ్దం తర్వాత మళ్లీ అదే ఘనతను ఈ యువ జోడీ పునరావృతం చేసింది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, కామన్వెల్త్ గేమ్స్ అనుభవంతో ఇప్పుడు ప్రపంచ వేదికపై కూడా తాము తక్కువ కాదు అని నిరూపించారు.
అయితే ఇదే టోర్నీలో మెన్స్ డబుల్స్‌లో మాత్రం మనకు నిరాశ ఎదురైంది. ఐదో సీడ్ సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్స్‌లో చైనా జోడీ చేతిలో పరాజయంపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. సాత్విక్-చిరాగ్ ఓటమి కలిగించిన బాధను.. ట్రీసా-గాయత్రి విజయం దూరం చేసిందని చెప్పవచ్చు. సెమీఫైనల్లో అడుగుపెట్టి కనీసం కాంస్య పతకం పక్కా చేసుకున్న మన అమ్మాయిలు, స్వర్ణం సాధించి మరింత చరిత్ర సృష్టించాలని కోరుకుందాం.

