Shikhar Dhawan: రెండో పెళ్లికి సిద్ధమైన శిఖర్ ధావన్: ఫిబ్రవరిలో సోఫీ షైన్‌తో వివాహం!
ఫిబ్రవరిలో సోఫీ షైన్‌తో వివాహం!

Shikhar Dhawan: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన చిరకాల స్నేహితురాలు సోఫీ షైన్‌ను ఆయన వివాహం చేసుకోబోతున్నట్లు 'హిందుస్థాన్ టైమ్స్' (HT City) నివేదిక వెల్లడించింది. వీరి వివాహ వేడుక ఫిబ్రవరి మూడో వారంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు క్రికెట్ దిగ్గజాలతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
శిఖర్ ధావన్, సోఫీ షైన్ గత కొన్నేళ్లుగా పరిచయస్తులని సమాచారం. దుబాయ్‌లో మొదటిసారి కలిసిన వీరు, ఆ తర్వాత స్నేహితులుగా మారి, గత ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో స్టేడియం స్టాండ్స్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో వీరి సంబంధం గురించి వార్తలు మొదలయ్యాయి. ఈ వివాహ వేడుక పనులన్నీ ధావన్ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని, తన జీవితంలో వస్తున్న ఈ మార్పు పట్ల ఆయన చాలా సంతోషంగా ఉన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
శిఖర్ ధావన్ గతంలో ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి 11 ఏళ్ల కుమారుడు జోరావర్ ధావన్ ఉన్నాడు. అయితే, మనస్పర్థల కారణంగా వీరిద్దరూ 2023లో విడిపోయారు. భార్య ఆయేషా ప్రవర్తన వల్ల ధావన్ మానసిక వేదనకు గురయ్యారని, ముఖ్యంగా కుమారుడికి దూరంగా ఉండటం వల్ల ఆయన ఇబ్బంది పడ్డారని పేర్కొంటూ ఢిల్లీ కోర్టు 2023 అక్టోబర్‌లో వీరికి విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం 40 ఏళ్ల ధావన్, సోఫీ షైన్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుండటంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

