Shock in Chess World: చెస్ ప్రపంచంలో సంచలనం.. క్యాండిడేట్స్ టోర్నీ నుంచి కోనేరు హంపి అవుట్.!
క్యాండిడేట్స్ టోర్నీ నుంచి కోనేరు హంపి అవుట్.!

Shock in Chess World: భారత చెస్ చరిత్రలో ఒక శకం. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి. ప్రపంచ చెస్ యవనికపై భారత్ జెండాను రెపరెపలాడించిన ఈ ధీర వనిత తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు క్రీడా లోకాన్ని విస్మయానికి గురి చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన 'మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్' నుండి హంపి వైదొలగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
"అసలు ఈ క్యాండిడేట్స్ టోర్నీ అంటే ఏమిటి? ప్రపంచ ఛాంపియన్‌షిప్ బెర్తును ఖరారు చేసే అత్యంత కీలకమైన పోరు ఇది. ఇందులో గెలిచిన వారే ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్‌తో తలపడే అర్హత సాధిస్తారు. గత ఎన్నో ఏళ్లుగా హంపి ఈ టైటిల్ కోసం పోరాడుతోంది. భారత అభిమానులందరూ ఈసారి హంపి ఖచ్చితంగా గెలుస్తుందని ఆశలు పెట్టుకున్న తరుణంలో, ఆమె తప్పుకోవడం పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించింది.
హంపి ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? అధికారికంగా 'వ్యక్తిగత కారణాల వల్ల' తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ.. తెర వెనుక కొన్ని అసంతృప్తులు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) మార్చిన కొన్ని నిబంధనలు, అలాగే టోర్నీల షెడ్యూల్ పట్ల హంపి గతంలోనే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. క్రీడాకారుల శ్రేయస్సు కంటే వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నది ఆమె ప్రధాన అభ్యంతరం.
హంపి లేని ఈ టోర్నీలో భారత ఆశలు ఇప్పుడు ఆర్.వైశాలి ,ఇతర యువ క్రీడాకారిణులపైనే ఉన్నాయి. అనుభవం రీత్యా హంపి స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికైనా కష్టమైన పని. అయితే, గతంలో కూడా హంపి తన కెరీర్‌లో సుదీర్ఘ విరామాలు తీసుకుని మళ్ళీ అద్భుతంగా పునరాగమనం చేసిన సందర్భాలు ఉన్నాయి. బహుశా ఇది కూడా అలాంటి ఒక చిన్న విరామమే కావచ్చు.

