T20I Series: శ్రేయస్ సేన అరుదైన రికార్డు.. జింబాబ్వేపై 3-0తో టీ20 సిరీస్ కైవసం
టీ20 సిరీస్ కైవసం

T20I Series: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా తన మొట్టమొదటి టీ20 సిరీస్‌ను అద్భుత విజయంతో ముగించింది. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్స్విప్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.ఆదివారం జరిగిన ఆఖరి, మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు సర్వసభ్య ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించింది.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగి 81 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతనికి తోడుగా ఇషాన్ కిషన్ (29), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (27), రింకు సింగ్ (25) రాణించడంతో భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 2 వికెట్లు తీయగా, రజా, మద్వీర, ముజరబాని చెరో వికెట్ పడగొట్టారు.193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.
జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్ (54 నాటౌట్) పోరాడినప్పటికీ, మిగతావార నుంచి తగిన సహకారం లభించలేదు. వెస్లీ మద్వీర (28), బెన్ కర్రాన్ (20) పరుగులు చేసినా లక్ష్యాన్ని అందుకోలేకపోయారు.భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్‌తో 3 వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్నిశాసించాడు. యశ్ ఠాకూర్ 2 వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్, అశోక్ శర్మ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ మెరుపులు, బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ ధాటికి జింబాబ్వే జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీ కెరీర్‌ను అద్భుతమైన సిరీస్ విజయంతో ప్రారంభించారు.

