Shreyas Iyer: ఇటీవల ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో టీమ్ ఇండియాపై విమర్శల దాడి పెరిగిన సంగతి తెలిసిందే.

ఈ ప్రతికూల పరిస్థితుల నడుమ భారత్ ఇప్పుడు జింబాబ్వే పర్యటనకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి జింబాబ్వేతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ తొలి మ్యాచ్‌కి ముందు(బుధవారం) మీడియాతో మాట్లాడిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, జట్టు మనోస్థైర్యాన్ని పెంచేలా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఒక జట్టుగా ఏ విషయాలపై దృష్టి పెట్టాలో తమకు స్పష్టత వచ్చిందని పేర్కొన్నాడు.

మనసులో వైఫల్యాల గురించి భయం ఉన్నంత కాలం... ఆటగాళ్ళు కేవలం తమ వికెట్ కాపాడుకోవడానికే ఆడతారని శ్రేయస్ వ్యాఖ్యానించాడు. ఆ ఓటమి భయాన్ని పూర్తిగా పక్కన పెట్టినప్పుడే ఆటగాడిలోని అసలైన అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుందని స్పష్టం చేశాడు. మన జట్టులో కొందరు తొలిసారి జింబాబ్వేలో ఆడుతున్నందున, ఇక్కడి పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటుపడితే అంత మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు.

"ఇంగ్లాండ్ నుంచి నిన్ననే వచ్చాం, ఈ రోజు ప్రాక్టీస్ సెషన్, రేపే మ్యాచ్... ఇది నిజంగా పెద్ద సవాలు!" అని శ్రేయస్ పేర్కొన్నాడు. అయితే ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే రాణించి గెలిస్తే ఆ తృప్తి, కిక్ వేరుగా ఉంటాయన్నాడు. గత సిరీస్ ఓటములు తమను మానసికంగా దెబ్బతీయలేదని, పైగా జట్టు సభ్యులందరినీ మరింత దగ్గర చేశాయని వెల్లడించాడు.

గతంలో ఏం జరిగింది అనేదానికంటే వర్తమానంలో కలిసికట్టుగా ఆడటమే తమ లక్ష్యమని... జింబాబ్వేపై గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగుతున్నామని శ్రేయస్ అయ్యర్ విశ్వాసంతో ముగించాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story