Shubman Gill: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు సృష్టించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గిల్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నారు. గుజరాత్ టైటాన్స్ తరపున ఐపీఎల్‌లో 100 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్‌కు ముందు గిల్ 100 సిక్సర్ల మార్కును చేరడానికి 3 సిక్సర్లు అవసరమవ్వగా.. బెంగళూరు నిర్దేశించిన 156 పరుగుల లక్ష్య ఛేదనలో ఆయన చెలరేగి ఆడారు. తొలి ఓవర్‌లోనే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఒక సిక్సర్ బాదిన గిల్.. ఆ తర్వాత రెండో ఓవర్‌లో జోష్ హేజిల్‌వుడ్ వేసిన బంతులకు మరో రెండు సిక్సర్లు కొట్టి తన వందవ సిక్సర్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో గిల్ కేవలం 18 బంతుల్లోనే 43 పరుగులు చేసి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన వారి జాబితాలో గిల్ (100) తర్వాత సాయి సుదర్శన్ (69) రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఐపీఎల్ మొత్తంగా చూస్తే, ఒకే జట్టు తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు విరాట్ కోహ్లీ (306 సిక్సర్లు - RCB) పేరిట ఉండగా, ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (259 సిక్సర్లు - MI) ఉన్నారు. గిల్ తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు 136 సిక్సర్లు బాదారు (KKR తరపున 36, GT తరపున 100).

PolitEnt Media

PolitEnt Media

Next Story