Smriti Mandhana’s Wedding: తండ్రికి గుండెపోటు.. ముహుర్తానికి ముందు ఆగిన స్మృతి మంధాన పెళ్లి
ముహుర్తానికి ముందు ఆగిన స్మృతి మంధాన పెళ్లి

Smriti Mandhana’s Wedding: భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన,సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడింది. వారి వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా మహారాష్ట్రలోని సాంగ్లీలో ఆమె పెళ్లి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. వివాహానికి ముందు మెహందీ వేడుకను నిర్వహించారు. ఈ సెలెబ్రేషన్ లో చాలామంది మహిళా క్రికెటర్లు సందడి చేస్తూ కనిపించారు. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా గుండెపోటుకు అస్వస్థతకు గురవడంతో పెళ్లి వాయిదా వేశారు.
స్మృతి తండ్రి శ్రీనివాస్ ను వెంటనే సాంగ్లీలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.తన తండ్రి పూర్తిగా కోలుకునే వరకు వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి మంధాన నిర్ణయించుకున్నారని ఆమె మేనేజర్ తుహిన్ మిశ్రా ధృవీకరించారు.తదుపరి వివాహ తేదీని ఇంకా ప్రకటించలేదు. వారి కుటుంబ గోప్యతను గౌరవించాలని కూడా మేనేజర్ విజ్ఞప్తి చేశారు.
స్మృతి మంధాన తన నిశ్చితార్థాన్ని ఒక అధికారిక ప్రకటన ద్వారా కాకుండా, తన టీమ్‌మేట్స్ (జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ వంటివారు)తో కలిసి చేసిన సరదా ఇన్‌స్టాగ్రామ్ రీల్ (వీడియో) ద్వారా ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో ఆమె తన చేతికి ఉన్న ఎంగేజ్‌మెంట్ రింగ్ను చూపించారు.స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌లు 2019 నుంచీ ప్రేమలో ఉన్నారు.2024 జూలైలో తమ ఐదేళ్ల బంధాన్ని బహిరంగంగా ప్రకటించారు.

