ఘోర ఓటమి

South Africa: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో సౌతాఫ్రికా ఘోర పరాజయం పాలైంది. 415 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ బ్యాటర్లు 72 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ జట్టు బ్యాటర్లలో టాప్ స్కోరర్ బాష్(20) అంటేనే వాళ్ల ఆట ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆర్చర్ 4 వికెట్లు తీసి సౌతాఫ్రికా టాపార్డర్‌ను పడగొట్టారు. దీంతో 342 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఓడింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడా ఓటమి ఇదే కావడం గమనార్హం. టాస్ నెగ్గిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్, జాకోబ్ బేతెల్ సెంచరీలతో కదం తొక్కారు. రూట్ 96 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 6 ఫోర్లు కొట్టాడు. బేతెల్ 82 బంతుల్లోనే 110 పరుగులు చేశాడు. 13 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. జేమీ స్మిత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. చివరలో జోస్ బట్లర్ (62), విల్ జాక్స్ (19) మెరుపులు మెరిపించారు. దీంతో ఇంగ్లండ్ 414 పరుగుల భారీ స్కోర్ చేసింది. 415 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా చతికిలపడింది. ఆ జట్టులో ఇద్దరు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఒకరు ఆబ్సెంట్ హర్ట్. ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇది వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అత్యధిక తేడాతో నమోదైన పరాజయం. గతంలో భారత్‌తో జరిగిన వన్డేలో శ్రీలంక 317 పరుగుల తేడాతో ఓడింది.

ఆ రికార్డే ఇప్పటివరకు అతిపెద్ద ఓటమిగా నిలిచింది. అయితే తాజాగా దాన్ని అధిగమిస్తూ సౌతాఫ్రికా కొత్త రికార్డును సృష్టించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం సౌతాంప్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story