Spinner Yuzvendra Chahal: టెక్నాలజీ క్రీడల స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసిందని అన్నాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్. స్పోర్ట్స్, వెల్‌నెస్, ఫిట్‌నెస్ రంగాల్లో టెక్నాలజీ స్టార్టప్స్‌కు ‘స్ప్రింట్ ఎక్స్’ సంస్థ ఒక గొప్ప మార్గదర్శిగా పని చేస్తోందని కొనియాడాడు. స్పోర్ట్స్ టెక్, గేమింగ్, ఈ-స్పోర్ట్స్ స్టార్టప్‌ల కోసం రూపొందించిన ‘స్ప్రింట్ ఎక్స్ ప్లేమేకర్స్’ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని చహల్ ఘనంగా ప్రారంభించాడు.

ఈ సందర్భంగా చహల్ మాట్లాడుతూ.. గత 7, 8 ఏళ్లుగా క్రీడలతో టెక్నాలజీ బంధం మరింత పెరిగిందని అన్నాడు. కేవలం ఆట ప్రణాళికలు, వ్యూహాలు, సన్నద్ధత మాత్రమే కాకుండా.. ప్లేయర్స్ ఫిట్‌నెస్, వెల్‌నెస్ పరంగా కూడా టెక్నాలజీ అందిస్తున్న సేవలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నాడు.ముఖ్యంగా క్రికెట్ విషయానికొస్తే.. ప్రత్యర్థి ఆటగాళ్ల బలహీనతలను అంచనా వేయడానికి సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోందన్నాడు చహల్. పిచ్‌పై ఏ లెంగ్త్‌లో బాల్స్ వేయాలి? ఎక్కడ బంతులు వేయకూడదు? బ్యాటర్లను ఎలా కట్టడి చేయాలి? అనే విషయాల్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని వివరించాడు.

కేవలం గ్రౌండ్ లోనే కాదు.. ప్రాక్టీస్, మ్యాచ్ డే తర్వాత ఆటగాళ్లు తిరిగి బాడీ రీఛార్జ్ చేసుకునేందుకు.. అలాగే గాయపడినప్పుడు వేగంగా కోలుకునేందుకు కూడా టెక్నాలజీ సాయం తీసుకుంటున్నామని చహల్ స్పష్టం చేశాడు. భవిష్యత్తులో స్పోర్ట్స్ రంగంలో టెక్ స్టార్టప్స్ మరింత విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story