Asia Cup Final: 2026 మహిళల ఆసియా కప్‌లో శ్రీలంక ఫైనల్‌కు దూసుకెళ్లింది. దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై శ్రీలంక 4 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.

131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. పవర్‌ప్లేలోనే 31 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. పాకిస్థాన్ బౌలర్ ఫాతిమా సనా చమరీ అథపతు (5), సంజన కవిందీ (0)లను ఔట్ చేయగా.. సాదియా ఇక్బాల్ హసిని పెరీరా (3)ను పెవిలియన్‌కు పంపింది. అనంతరం ఇమేషా దులానీ 22 పరుగులు చేయగా, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హారి జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు ఈ ఇద్దరూ 67 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హర్షిత 31 బంతుల్లో 36 పరుగులు, దిల్హారి 33 బంతుల్లో 33 పరుగులు చేసి 17వ ఓవర్‌లో ఫాతిమా సనా బౌలింగ్‌లో ఔటయ్యారు.

అప్పటికే విజయానికి చేరువైన శ్రీలంకను నీలాక్షి డి సిల్వా, కౌషాని నుథ్యంగనా విజయతీరాలకు చేర్చారు. నీలాక్షి 18 పరుగులతో, కౌషాని 10 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో శ్రీలంక 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా 4 వికెట్లు పడగొట్టి 38 పరుగులు ఇచ్చి అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ.. మిగతా బౌలర్ల నుంచి తగిన సహకారం లభించకపోవడంతో పాక్ ఓటమి తప్పలేదు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌ను శ్రీలంక బౌలర్లు 130/5కే పరిమితం చేశారు. సుగంధిక కుమారి ఆరంభంలోనే మునీబా అలీని ఔట్ చేయగా.. మధ్య ఓవర్లలోనూ శ్రీలంక బౌలర్లు పాకిస్థాన్ బ్యాటర్లపై ఒత్తిడి కొనసాగించారు. షవాల్ జుల్ఫికర్ 16 బంతుల్లో 24 పరుగులు చేసిన తర్వాత ఐదో ఓవర్‌లో ఔటయ్యారు. ఆయేషా జాఫర్ (7), సదాఫ్ షమాస్ (8) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో పాకిస్థాన్ 52 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత గుల్ ఫెరోజా, ఫాతిమా సనా 40 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఫెరోజా 16వ ఓవర్‌లో ఔట్ కాగా, ఫాతిమా 36 బంతుల్లో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. తుబా హసన్ 12 పరుగులతో అజేయంగా నిలవడంతో పాకిస్థాన్ 130/5 స్కోరు చేసింది. శ్రీలంక బౌలర్లలో చమరీ అథపతు, చముడి ప్రభోద చెరో రెండు వికెట్లు తీయగా.. సుగంధిక కుమారి ఒక వికెట్ సాధించింది. దీంతో పాకిస్థాన్‌ను ఇంటికి పంపిన శ్రీలంక.. డిఫెండింగ్ ఛాంపియన్ల హోదాలో భారత్‌తో మరోసారి ఆసియా కప్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది.

Next Story