Ajinkya Rahane: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాటర్ అజింక్య రహానే
అజింక్య రహానే

Ajinkya Rahane: భారత స్టార్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్ల నుంచి తక్షణమే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. 2023 వెస్టిండీస్ పర్యటనలోనే ఆయన భారత్ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. 38 ఏళ్ల రహానే 2013లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించి మొత్తం 85 టెస్టులు, 90 వన్డేలు మరియు 20 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.
ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకుంటూ.. "ప్రతి విషయానికి ఒక ప్రారంభం, ఒక ముగింపు ఉంటుంది. సమయం వచ్చినప్పుడు దాన్ని గౌరవించి ముందుకు సాగాలి. నా బ్యాటింగ్‌లో ఎప్పుడూ టైమింగ్‌నే నమ్ముకున్నాను. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పడానికి ఇదే సరిగ్గా అనువైన సమయమని భావిస్తున్నాను. డాంబివ్లీ నుంచి ప్రాక్టీస్ కోసం వెళ్లే రోజుల నుంచి దేశం తరఫున ఆడటమే నా కలగా ఉండేది. నా దేశం, నా జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చాను. గత 20 ఏళ్లలో భారత క్రికెట్ ఎంతో ఎదిగింది, అందులో భాగం కావడం నాకు గర్వంగా ఉంది" అని రహానే భావోద్వేగానికి లోనయ్యారు.
భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణించిన రహానే తన టెస్టు కెరీర్‌లో 38.46 సగటుతో 5,077 పరుగులు చేశారు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 3 సెంచరీలు, 24 ఫిఫ్టీలతో 2,962 పరుగులు చేయగా, 20 టీ20ల్లో ఒక హాఫ్ సెంచరీతో 375 పరుగులు సాధించారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, క్రికెట్ ఆటతో తన అనుబంధం కొనసాగుతుందని, రాబోయే తరం క్రికెటర్లకు మార్గదర్శిగా ఉంటూ ఆట నుంచి నేర్చుకున్న విలువలను పంచుకుంటానని రహానే వెల్లడించారు.

