Steve Smith Loses Cool: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఓటమి పాలవ్వడమే కాకుండా, ఆ జట్టు స్టార్ ఓపెనర్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆగ్రహంతో ఊగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం వేదికగా హైదరాబాద్ కింగ్స్‌మెన్‌తో జరిగిన కీలక పోరులో ముల్తాన్ సుల్తాన్స్ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుండి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో స్మిత్ కేవలం 13 పరుగులు (10 బంతుల్లో) మాత్రమే చేసి నిరాశపరిచాడు.

మైదానంలో స్మిత్ ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇన్నింగ్స్ మూడవ ఓవర్‌లో మొహమ్మద్ అలీ బౌలింగ్‌లో స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్ వదిలేసినప్పటికీ, ఆ తర్వాత రెండు బంతులకే మళ్ళీ అదే ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తన ఆటతీరుపై తీవ్ర అసంతృప్తికి లోనైన స్మిత్, డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన తర్వాత కోపంతో తన బ్యాట్‌ను బలంగా బాదాడు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ గ్రెగ్ బ్లెవెట్ వ్యాఖ్యాతగా ఉంటూ, "స్మిత్ నుండి ఇలాంటి స్పందనను మనం తరచుగా చూడము" అని పేర్కొన్నాడు.

ఈ సీజన్‌లో స్మిత్ ఓవరాల్‌గా మంచి ప్రదర్శనే కనబరిచాడు. తన తొలి పీఎస్ఎల్ సీజన్‌లో 11 ఇన్నింగ్స్‌ల్లో 161.70 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 380 పరుగులు చేశాడు. అయితే నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం తన మార్క్ చూపలేకపోయాడు. మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ జట్టులో షాన్ మసూద్ (69 నాటౌట్) మినహా మిగిలిన బ్యాటర్లెవరూ 18 పరుగుల మార్కును కూడా దాటలేకపోవడంతో ఆ జట్టు 159 పరుగులకే పరిమితమైంది.

హైదరాబాద్ కింగ్స్‌మెన్ బ్యాటర్లు మాజ్ సదాకత్ (64*), ఉస్మాన్ ఖాన్ (64) మెరుపు ఇన్నింగ్స్‌ల వల్ల కేవలం 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. మార్నస్ లబుషేన్ సారధ్యంలోని హైదరాబాద్ జట్టు వరుసగా మొదటి నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయినప్పటికీ, అద్భుతంగా పుంజుకుని ప్లేఆఫ్స్‌కు చేరడం విశేషం. శుక్రవారం జరగనున్న ఎలిమినేటర్ 2లో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శనివారం జరిగే ఫైనల్‌లో పెషావర్ జల్మీతో అమీతుమీ తేల్చుకోనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story