Sunil Gavaskar: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా శ్రీలంక గడ్డపై అడుగుపెడుతున్న టీమిండియాకు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనున్న తరుణంలో గావస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

శ్రీలంకతో వారి సొంత గడ్డపై టెస్టు సిరీస్ అంత ఈజీ కాదని, లంకను వారి గడ్డపై ఓడించడం కష్టంతో కూడుకున్న పనని గావస్కర్ పేర్కొన్నారు. అయితే, వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే భారత్ ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆటగాళ్లకు ఆయన ఒక బలమైన సందేశాన్నిచ్చారు. ఎంతటి గొప్ప స్టార్ ప్లేయర్ అయినా సరే, వ్యక్తిగత రికార్డులు లేదా మైలురాళ్ల కంటే ఎప్పుడూ 'జట్టు ప్రయోజనాలే' అత్యంత ముఖ్యమని హితవు పలికారు. వ్యక్తి కాదు, భారత క్రికెట్టే మనకు తొలి ప్రాధాన్యం కావాలని ఆయన తేల్చిచెప్పారు.

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉన్న టీమిండియా ఫైనల్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శన చేయాల్సి ఉంది. గావస్కర్ సూచించినట్లుగా స్టార్ కల్చర్‌ను పక్కనపెట్టి, సమిష్టి ఆటపై దృష్టి పెడితేనే లంకలో విజయం సాధ్యమవుతుంది. మరి గావస్కర్ హెచ్చరికలను మనోళ్లు ఎంతవరకు పాటిస్తారో, లంకలో ఎలాంటి ఫలితాన్ని రాబడతారో వేచి చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story