Sunrisers Hyderabad: SRHలోకి వరల్డ్ కప్ సంచలనం.. శివమ్ మావి అవుట్ - అంబరీష్ ఇన్
శివమ్ మావి అవుట్ - అంబరీష్ ఇన్

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2026 సీజన్‌లో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి ఒక సరికొత్త కుర్రాడు అడుగుపెట్టాడు. గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమైన సీనియర్ పేసర్ శివమ్ మావి స్థానాన్ని.. యువ సంచలనం ఆర్‌ఎస్ అంబరీష్‌తో భర్తీ చేసింది ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్. గత మినీ వేలంలో 75 లక్షల రూపాయలకు మావిని కొనుగోలు చేసినప్పటికీ, గజ్జల్లో గాయం కారణంగా అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే లీగ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన అంబరీష్‌కు లక్కీ ఛాన్స్ దక్కింది.
ఎవరీ అంబరీష్ అని ఆరా తీస్తే.. ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. కేవలం 18 ఏళ్ల వయసున్న ఈ మీడియం పేస్ ఆల్‌రౌండర్, రీసెంట్‌గా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ 2026 విన్నింగ్ టీమ్‌లో కీలక సభ్యుడు. ఆ టోర్నీలో ఏకంగా 11 వికెట్లు తీసి, భారత్ తరఫున సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్‌గా సత్తా చాటాడు. కుడిచేతి వాటంతో బౌలింగ్ చేస్తూనే, ఎడమ చేతితో బ్యాటింగ్ చేసే అంబరీష్.. జట్టుకు మంచి బ్యాలెన్స్ ఇవ్వగలడు. ఇప్పటికే ప్రఫుల్ హింగే, సకిబ్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్న సన్‌రైజర్స్.. ఇప్పుడు అంబరీష్‌ను కూడా నేరుగా తుది జట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఆరు విజయాలు నమోదు చేసి, 12 పాయింట్లతో మూడో స్థానంలో పటిష్టంగా ఉంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలి ఉన్న ఐదు మ్యాచులు అత్యంత కీలకం. ఈ క్రమంలో మే 3వ తేదీన ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగబోయే హోరాహోరీ పోరులో హైదరాబాద్ తలపడనుంది. సొంత గడ్డపై జరగబోయే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ దిశగా మరో అడుగు వేయాలని ఆరెంజ్ ఆర్మీ పట్టుదలగా ఉంది.

