Finch Shocked Over Arshdeep’s Exclusion: టీ20 సిరీస్‌లో భారత్ ప్రయోగాలపై దుమారం.. అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టడంపై ఫించ్ షాక్
అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టడంపై ఫించ్ షాక్

Finch Shocked Over Arshdeep’s Exclusion: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాలు, ముఖ్యంగా జట్టు కూర్పు ఇప్పుడు క్రీడా వర్గాలలో హాట్ టాపిక్‌గా మారాయి. మొదటి మ్యాచ్ రద్దు కాగా రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్.. ప్రధాన బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులో చేర్చకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గంభీర్ నిర్ణయాలపై
కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు అర్థం కావడం లేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా టాప్ వికెట్ టేకర్ అయిన అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ వ్యాఖ్యానించారు. అర్ష్‌దీప్ స్థానంలో హర్షిత్ రాణాకు అవకాశం దక్కింది.
"అర్ష్‌దీప్ సింగ్ కచ్చితంగా తుది జట్టులో ఉండాలి. కనీసం మూడో టీ20లోనైనా అతడిని తీసుకోవాలి" అని ఫించ్ బలంగా నొక్కి చెప్పారు.
వరల్డ్ కప్ కోసం ప్రయోగాలు చేస్తున్నప్పటికీ, మరీ ఎక్కువగా బ్యాటర్లతోనే వెళితే మ్యాచులు గెలవడం కష్టమని ఫించ్ హెచ్చరించారు. "మెగా టోర్నీలో గెలవాలంటే కేవలం బ్యాటింగ్‌తోనే సాధ్యం కాదు. బౌలింగ్ విభాగం కూడా కీలకమే" అని ఫించ్ అన్నారు. రెండో టీ20లో భారత బౌలర్లు తేలిపోవడానికి ప్రధాన కారణం స్కోరు బోర్డుపై తగినన్ని పరుగులు లేకపోవడమేనని.. మరో 20-30 పరుగులు అదనంగా ఉండుంటే ఫలితం వేరేలా ఉండేదని ఆయన విశ్లేషించారు. సరైన కూర్పుతో బరిలోకి దిగాలని ఫించ్ సూచించారు.

