T20 World Cup 2026: అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త చరిత్ర
సరికొత్త చరిత్ర

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జింబాబ్వేతో జరిగిన కీలకమైన సూపర్-8 పోరులో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అర్ష్‌దీప్, తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 24 పరుగులే ఇచ్చి మూడు విరాకెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డును అధిగమించి, టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. బుమ్రా ఖాతాలో 33 వికెట్లు ఉండగా, అర్ష్‌దీప్ కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే 35 వికెట్లు సాధించి ఈ మైలురాయిని దాటేశాడు. ఈ టోర్నీలోనూ అర్ష్‌దీప్ నిలకడగా రాణిస్తూ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
జింబాబ్వే ఇన్నింగ్స్ సమయంలో అర్ష్‌దీప్ తన పదునైన బంతులతో బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో ప్రమాదకరంగా మారుతున్న సికందర్ రజాను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ వెంటనే ర్యాన్ బర్ల్‌ను డకౌట్‌గా వెనక్కి పంపడమే కాకుండా, తన చివరి ఓవర్‌లో టోనీ మున్యోంగాను క్లీన్ బౌల్డ్ చేసి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. అర్ష్‌దీప్ ధాటికి జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 72 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి సెమీఫైనల్ రేసులో బలంగా నిలిచింది.
అంతకుముందు బ్యాటింగ్‌లోనూ భారత్ శివమెత్తింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (55) ఈ టోర్నీలో తన తొలి హాఫ్ సెంచరీతో ఫామ్‌లోకి రాగా, చివర్లో హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 50*), తిలక్ వర్మ (16 బంతుల్లో 44*) విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ కేవలం 31 బంతుల్లోనే 81 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ విజయంతో జోరు మీదున్న భారత్, ఫిబ్రవరి 28 ఆదివారం రోజున కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో తమ చివరి సూపర్-8 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా అధికారికంగా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.

