టీమ్ ఇండియాకు బిగ్ షాక్

T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో రేపు (ఫిబ్రవరి 12) జరగనున్న రెండో గ్రూప్ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఓపెనర్, ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గత రెండు రోజులుగా కడుపులో ఇన్ఫెక్షన్ మరియు జ్వరంతో బాధపడుతున్న అతను, ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ సమయంలోనే అతను అస్వస్థతకు గురైనప్పటికీ బరిలోకి దిగి డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఢిల్లీలో జరిగిన టీమ్ ప్రాక్టీస్ సెషన్‌కు కూడా అతను దూరమయ్యాడు.

అభిషేక్ శర్మ గైర్హాజరీలో ఓపెనింగ్ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే దానిపై టీమ్ మేనేజ్‌మెంట్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతానికి కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ రేపటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెట్స్‌లో శాంసన్ సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరడం సానుకూలాంశం. పిచ్ పరిస్థితులను బట్టి బౌలింగ్ విభాగంలో అదనపు స్పిన్నర్ అవసరమైతే సుందర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఓపెనింగ్ రేసులో మాత్రం శాంసన్‌కే మొగ్గు కనిపిస్తోంది.

ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని, అభిషేక్ శర్మకు నమీబియా మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమమని కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ లాంటి బలమైన ప్రత్యర్థితో తలపడే సమయానికి ప్రధాన ఆటగాళ్లు వంద శాతం ఫిట్‌నెస్‌తో ఉండాలని యాజమాన్యం కోరుకుంటోంది. ఒకవేళ సంజూ శాంసన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నమీబియాపై రాణిస్తే, జట్టులో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా కూడా జ్వరం నుండి కోలుకుని ప్రాక్టీస్‌లో పాల్గొనడం భారత అభిమానులకు ఊరటనిచ్చే విషయం.

PolitEnt Media

PolitEnt Media

Next Story