అహ్మదాబాద్ స్టేడియంలో అసలేం జరిగిందంటే?

T20 World Cup 2026: అహ్మదాబాద్‌ వేదికగా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పెను ప్రమాదం తప్పింది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యువ ఆటగాడు రింకూ సింగ్ క్యాచ్ కోసం ప్రయత్నిస్తూ ఒకరినొకరు ఢీకొనేంత పనిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మ్యాచ్ చివరి ఓవర్‌లో శివం దూబే వేసిన బంతిని నెదర్లాండ్స్ బ్యాటర్ గాల్లోకి లేపగా, ఎక్స్‌ట్రా కవర్ నుంచి సూర్య వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు, అదే సమయంలో డీప్ నుంచి రింకూ సింగ్ ముందుకు దూసుకొచ్చాడు.

నిజానికి ఆ క్యాచ్ పట్టడానికి రింకూ సింగ్‌కు మంచి అవకాశం ఉన్నప్పటికీ, సూర్య కూడా పట్టుదలతో పరిగెత్తుకుంటూ రావడంతో ఇద్దరి మధ్య గందరగోళం నెలకొంది. చివరి నిమిషంలో సూర్యను గమనించిన రింకూ, ప్రమాదాన్ని పసిగట్టి పక్కకు తప్పుకున్నాడు. దీంతో ఆ క్యాచ్ నేలపాలైంది. ఈ క్రమంలో సూర్య ఒక్కసారిగా కింద పడిపోవడంతో బుమ్రాతో సహా జట్టు సభ్యులంతా కాసేపు ఆందోళన చెందారు. అయితే సూర్యకు ఎటువంటి గాయం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ వెంటనే రింకూపై సూర్య తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ వాదించడం మైదానంలో కనిపించింది.

నిజానికి ఇలాంటి సందర్భాల్లో ముందు వైపు పరిగెత్తుకుంటూ వచ్చే ఫీల్డర్‌కే క్యాచ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా అప్పటికే భారత్ సూపర్-8కు అర్హత సాధించిన నేపథ్యంలో, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఆటగాళ్ల భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. హార్దిక్ పాండ్యా, శివం దూబేల మెరుపు ఇన్నింగ్స్‌ల వల్ల భారత్ 193 పరుగులు చేయగా, వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో నెదర్లాండ్స్‌ను కట్టడి చేశాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story