T20 World Cup 2026: జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ..వెస్టిండీస్ పై గెలిస్తే సెమీస్ కే
వెస్టిండీస్ పై గెలిస్తే సెమీస్ కే

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ సూపర్-8 దశలో భాగంగా నిన్న చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్ రేసులో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఇది టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్‌కు అత్యధిక స్కోరు. అభిషేక్ శర్మ ఫామ్‌లోకి వస్తూ 30 బంతుల్లో 55 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేవలం 23 బంతుల్లోనే 50 పరుగులు (నాటౌట్) చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. తిలక్ వర్మ చివర్లో మెరుపులు మెరిపిస్తూ కేవలం 16 బంతుల్లోనే 44 పరుగులు (నాటౌట్) చేసి జట్టు స్కోరును 250 దాటించాడు. సంజూ శాంసన్ (24), ఇషాన్ కిషన్ (38), సూర్యకుమార్ యాదవ్ (33) కూడా తమ వంతు సహకారాన్ని అందించారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ ఒంటరి పోరాటం చేస్తూ 59 బంతుల్లో 97 పరుగులు (నాటౌట్) చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సికందర్ రజా 21 బంతుల్లో 31 పరుగులు చేశాడు.భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడిస్తే నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.

