T20 World Cup 2026: రికార్డుల వేటలో భారత్.. టీ20ల్లో 200లు కొట్టడం టీమిండియాకు అలవాటే!
టీ20ల్లో 200లు కొట్టడం టీమిండియాకు అలవాటే!

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. గురువారం నమీబియాతో జరిగిన రెండో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా ఏకంగా 209 పరుగుల భారీ స్కోరు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఫార్మాట్‌లో భారత్ 200 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది 47వ సారి కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్‌కు లభించిన అతిపెద్ద విజయం. అయితే నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ అనూహ్యంగా రాణించి 4 వికెట్లు తీయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయింది.
బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కిషన్, మొత్తం 24 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే పునాది వేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా తన మార్కు బ్యాటింగ్‌తో 28 బంతుల్లోనే 52 పరుగులు సాధించి స్కోరును 200 దాటించాడు. సంజూ శామ్సన్ మూడు సిక్సర్లతో మెరుపులు మెరిపించినా 22 పరుగులకే పరిమితమయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో తక్కువ పరుగులకే అవుట్ అయినప్పటికీ, మిగతా బ్యాటర్ల ధాటికి భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
ఈ భారీ స్కోరుతో టీ20ల్లో అత్యధిక సార్లు 200 ప్లస్ పరుగులు చేసిన జట్టుగా భారత్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. భారత్ తర్వాత దక్షిణాఫ్రికా 29 సార్లు ఈ ఘనత సాధించగా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా 2024 ప్రపంచకప్ తర్వాత భారత్ బ్యాటింగ్ శైలి పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 14 సార్లు భారత్ 200 మార్కును దాటడం గమనార్హం. ఢిల్లీలోని కోట్లా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ల జోరు చూస్తుంటే ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

