T20 World Cup 2026: ప్రపంచం క్రికెట్ లో ఇటలీ సంచలనం
ఇటలీ సంచలనం

T20 World Cup 2026: అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక సంచలనం నమోదైంది. టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి ఆడుతున్న ఇటలీ జట్టు, బలమైన నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ అద్భుత విజయం తర్వాత ఇటలీ డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన వేడుకల్లో బాలీవుడ్ సీనియర్ నటుడు కబీర్ బేడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇటలీలో 'సందోకన్' టీవీ సిరీస్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కబీర్ బేడీ, ఆటగాళ్లతో కలిసి ఈ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు. ఇటలీ క్రికెట్ ప్రెసిడెంట్ సిమోన్ గంబినో మాట్లాడుతూ.. "ఇటలీలో అందరికీ తెలిసిన ఏకైక భారతీయ వ్యక్తి కబీర్ బేడీ మాత్రమే" అంటూ ఆయన్ని ఆకాశానికెత్తేశారు.
ఈ గెలుపుతో ఇటలీ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. గ్రూప్-సిలో ఉన్న ఇటలీ, తమ తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి సెమీఫైనల్‌కు వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటలీ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియన్ వియరీ కూడా టోర్నీకి ముందే క్రికెట్‌పై తనకున్న ఇష్టాన్ని చాటుకున్నారు. వెస్టిండీస్ లెజెండ్స్ వివ్ రిచర్డ్స్, జోయెల్ గార్నర్ వంటి వారి గురించి తనకు తెలుసని, ఇటలీలో క్రికెట్ పట్ల ఆసక్తి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కేవలం రెండో మ్యాచ్‌లోనే నేపాల్ వంటి జట్టును చిత్తు చేయడం ఇటలీ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.
జట్టు తాత్కాలిక కెప్టెన్ హ్యారీ మనేంటి ఈ విజయంపై స్పందిస్తూ.. ఇటాలియన్లు క్రికెట్‌కు సరికొత్త జోష్‌ను తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన సోదరుడు బెన్ మనేంటి కూడా అదే జట్టులో ఉండటం, కుటుంబం తరపున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. బాలీవుడ్ టచ్‌తో జరిగిన ఈ సెలబ్రేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

