సూపర్ 8కు శ్రీలంక

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై శ్రీలంక 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక కేవలం 52 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ (100 నాటౌట్) చేసి జట్టును గెలిపించాడు. ఈ వరల్డ్ కప్‌లో ఇదే మొదటి సెంచరీ.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మిచెల్ మార్ష్ (54), ట్రావిస్ హెడ్ (56) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 8.3 ఓవర్లలోనే 104 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత శ్రీలంక స్పిన్నర్లు చెలరేగడంతో ఆసీస్ కేవలం 181 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో దుషాన్ హేమంత 3 వికెట్లతో రాణించాడు.

182 పరుగుల భారీ లక్ష్యంతో ఛేధనకు దిగిన శ్రీలంకకు సరైన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ కుశాల్ పెరీరా తీవ్రంగా నిరాశ పర్చాడు. కేవలం ఒక్క రన్ మాత్రమే చేసి స్టోయినిస్ బౌలింగ్‎లో క్యాచ్ ఔట్ అయ్యాడు. అయినప్పటికీ మరో ఓపెనర్ నిస్సాంక తగ్గలేదు. కుశాల్ మెండిస్‎తో కలిసి ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ దశలో (51) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కుశాల్ మెండిస్ స్టోయినిస్ బౌలింగ్‎లో కీపర్ కాన్లీకి చిక్కాడు. అనంతరం పవన్ రాత్నాయక్ (28), నిస్సాంక (100) శ్రీలంకను విజయ తీరాలకు చేర్చారు.

ఈ విజయంతో శ్రీలంక గ్రూప్-బి నుంచి హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8 కు అర్హత సాధించింది. జింబాబ్వే చేతిలో ఇప్పటికే ఓడిపోయిన ఆస్ట్రేలియాకు, ఈ ఓటమి పెద్ద దెబ్బ. ఇప్పుడు ఆసీస్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై (ముఖ్యంగా జింబాబ్వే vs ఐర్లాండ్ మ్యాచ్‌పై) ఆధారపడి ఉంది.శ్రీలంక జట్టు ఈ టోర్నీలో ఆడుతున్న తీరు చూస్తుంటే, వారు టైటిల్ రేసులో గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story