టీమిండియా మేనేజ్‌మెంట్‌కు దాదా కీలక సూచన.

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో వరుసగా విఫలమవుతున్న కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అండగా నిలిచారు. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో తక్కువ స్కోర్లకే పరిమితమైన సంజూ, ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయారు. ఆయన స్థానంలో ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టగా, అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే తాజాగా ఫిబ్రవరి 12న నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో సంజూకు అవకాశం దక్కినా, కేవలం 8 బంతుల్లో 22 పరుగులు చేసి నిరాశపరిచారు. దీంతో పాకిస్థాన్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో సంజూను పక్కనపెట్టి వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గంగూలీ స్పందిస్తూ.. జట్టులో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఓపెనర్ అభిషేక్ శర్మ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే తప్పకుండా అతడు జట్టులోకి రావాలని, కానీ అభిషేక్ అందుబాటులో లేకపోతే మాత్రం సంజూ శాంసన్‌నే కొనసాగించాలని సూచించారు. ఒకటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్లను తప్పించడం సరైన పద్ధతి కాదని, ప్లేయర్లకు సరైన అవకాశాలు ఇచ్చినప్పుడే వారు నిరూపించుకోగలరని గంగూలీ అభిప్రాయపడ్డారు.

సంజూ శాంసన్ అత్యద్భుతమైన ప్రతిభ కలిగిన ఆటగాడని, 2024లో టీ20ల్లో మూడు సెంచరీలు బాది తన సత్తా ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నాడని గంగూలీ గుర్తు చేశారు. ప్రతి మ్యాచ్‌లోనూ 'ఈ మ్యాచ్ ఆడకపోతే జట్టు నుంచి తీసేస్తారు' అనే ఒత్తిడిలో ఏ ఆటగాడు రాణించలేడని ఆయన పేర్కొన్నారు. సంజూకు మరిన్ని అవకాశాలు ఇచ్చి, అతడికి అండగా నిలవాలని టీమ్ మేనేజ్‌మెంట్‌కు గంగూలీ సలహా ఇచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story