T20 World Cup 2026: వెస్టిండీస్ పై 9 వికెట్ల తేడాతో విజయం.. సెమీస్ కు సౌతాఫ్రికా
సెమీస్ కు సౌతాఫ్రికా

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ సూపర్-8 దశలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది.ఈ విజయంతో సౌతాఫ్రికా అధికారికంగా సెమీఫైనల్‌కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఒకానొక దశలో 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, జైసన్ హోల్డర్ (49) , రొమారియో షెపర్డ్ (52 నాటౌట్) ఎనిమిదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 89 పరుగులు జోడించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 176/8 గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సౌతాఫ్రికా బౌలింగ్ లో లుంగీ ఎంగిడి (3/30, కాగిసో రబడా (2/22) వెస్టిండీస్ టాపార్డర్‌ను దెబ్బతీశారు.
177 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం 16.1 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ 46 బంతుల్లో 82 పరుగులు (నాటౌట్) చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. క్వింటన్ డికాక్ 24 బంతుల్లో 47 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ర్యాన్ రికెల్టన్ 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
సౌతాఫ్రికా విజయం భారత్‌కు చాలా మేలు చేసింది. వెస్టిండీస్ ఓడిపోవడంతో వారి నెట్ రన్ రేట్ భారీగా తగ్గింది. దీనివల్ల మార్చి 1న కోల్‌కతాలో జరిగే భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ ఇప్పుడు ఒక'వర్చువల్ క్వార్టర్ ఫైనల్ గా మారింది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు వెళ్తుంది. ప్రస్తుత పాయింట్ల పట్టిక గ్రూప్1 లో సౌతాఫ్రికా- 4 పాయింట్లు (సెమీస్‌కు అర్హత సాధించింది). వెస్టిండీస్ 2 పాయింట్లు, భారత్ 2 పాయింట్లు, జింబాబ్వేలకు 0 పాయింట్లు ఉన్నాయి.

