రజనీకాంత్ డైలాగ్‌తో టీమిండియాకు సవాల్!

Tamil Thambi on Kiwi Soil: న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ తన ప్రయాణాన్ని విభిన్నంగా సాగిస్తున్నాడు. నాలుగు ఏళ్ల ప్రాయంలోనే తన కుటుంబంతో కలిసి వెల్లూరు నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లిన ఆదిత్య, నేడు అదే కివీస్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. తాజాగా భారత్ పర్యటనలో భాగంగా బరోడా వేదికగా ఆదివారం ప్రారంభం కానున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ బ్యాటర్లను ఎదుర్కోవడంపై ఆదిత్య ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఆదిత్య అశోక్ తన బౌలింగ్ చేసే కుడి చేతిపై తమిళంలో 'ఎన్ వళి తని వళి' (నా దారి రహదారి) అని ట్యాటూ వేయించుకున్నాడు. ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'పడయప్ప' (నరసింహా) సినిమాలోని ప్రసిద్ధ డైలాగ్. దీని వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ.. "మా తాతయ్యకు నేను చాలా దగ్గరగా ఉండేవాడిని. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి ఈ సినిమా చూశాం. ఆ సమయంలో మా మధ్య జరిగిన సంభాషణ నాకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఆయన జ్ఞాపకార్థం, నా సంస్కృతికి చిహ్నంగా ఈ ట్యాటూ వేయించుకున్నాను" అని ఆదిత్య భావోద్వేగానికి లోనయ్యాడు.

గతేడాది ఆదిత్య చెన్నైలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అకాడమీలో రెండు వారాల పాటు ప్రత్యేక శిక్షణ పొందాడు. అక్కడ భారత దేశంలోని ఎర్ర నేల, నల్ల నేల పిచ్‌లు ఎలా ప్రవర్తిస్తాయో అర్థం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌లో ఎక్కువగా పేస్ అనుకూల పిచ్‌లే ఉంటాయని, భారత ఉపఖండంలో బ్యాటర్లను ఎలా ముప్పుతిప్పలు పెట్టాలో తనకు కోచ్ శ్రీరామ్ కృష్ణమూర్తి ఎంతో సహాయం చేశారని ఆదిత్య తెలిపాడు. ఈ అనుభవం కోహ్లీ, రోహిత్ వంటి ఆటగాళ్లను ఎదుర్కోవడానికి పనికొస్తుందని అతను ఆశిస్తున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ తన ఆరాధ్య దైవమని చెప్పిన ఆదిత్య.. భారత సంతతికే చెందిన కివీస్ స్పిన్నర్లు తరుణ్ నేతుల, ఈష్ సోధిని తన 'పెద్ద అన్నయ్యలు'గా భావిస్తాడు. ముఖ్యంగా వెన్నునొప్పి కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని కష్టకాలంలో ఉన్నప్పుడు మాజీ క్రికెటర్ పాల్ వైజ్ మన్ తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నాడు. జనవరి 11న బరోడాలో, 14న రాజ్‌కోట్‌లో, 18న ఇండోర్‌లో జరగనున్న వన్డే మ్యాచులు ఆదిత్య అశోక్ కెరీర్‌కు అత్యంత కీలకంగా మారనున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story