Tamim Iqbal: క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ ఆటగాడు, ప్రస్తుత బోర్డు కీలక వ్యక్తి తమీమ్ ఇక్బాల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ వివాదంపై ఆయన తాజాగా స్పందిస్తూ.. ఆ సమయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ్యవహరించిన తీరుపై సంచలన అంగీకారం తెలిపారు. అసలు ఆ వివాదాన్ని మరింత మెరుగ్గా హ్యాండిల్ చేసి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్‌లో ముస్తాఫిజుర్ రహమాన్‌ను ఫ్రాంచైజీ విడుదల చేయడం, ఆ తర్వాత భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్‌ నుంచి తప్పుకోవడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఈ పరిణామాలు భారత్ - బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయి. అయితే ఈ అంశంపై తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ముస్తాఫిజుర్ విషయంలో బంగ్లాదేశ్ కోపంగా ఉండటం సహజమే అయినప్పటికీ, ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీని బహిష్కరించే నిర్ణయం విషయంలో మాత్రం తొందరపడ్డామని పరోక్షంగా అంగీకరించారు. చర్చలు ప్రారంభ దశలోనే ఎలాంటి వెనకడుగు వేయలేని 'పాయింట్ ఆఫ్ నో రిటర్న్' స్థాయికి వెళ్లాయని, బంగ్లాదేశ్ మరింత పరిణతితో చర్చలు జరిపి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు.

క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టకూడదని తమీమ్ గట్టిగా నొక్కిచెప్పారు. సమస్య ఏదైనా సరే ప్రారంభంలోనే కఠిన వైఖరి ప్రదర్శిస్తే ఎలాంటి పరిష్కారం లభించదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక భారత్ - బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి మాట్లాడుతూ.. రెండు బోర్డుల మధ్య సానుకూల వాతావరణం ఉందని, సరైన విండో చూసి త్వరలోనే దానికి సంబంధించి స్పష్టత వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన విషయాలపై వివాదాలు పక్కనపెట్టి, భవిష్యత్తులో క్రీడా స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తమీమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి.

Updated On
Next Story