Tanush Kotian: దేశవాళీ క్రికెట్‌లో ముంబై స్పిన్నర్‌ తనుష్‌ కోటియన్‌ అద్భుత ప్రదర్శనతో వార్తల్లో నిలిచాడు. రైల్వేస్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్‌ లైనప్‌ను దెబ్బతీశాడు. 18.5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన కోటియన్‌ కేవలం 45 పరుగులిచ్చి 7 వికెట్లు సాధించాడు.

ఇటీవలే హర్యానాతో జరిగిన మ్యాచ్‌లోనూ కోటియన్‌ 11 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఇప్పుడు మరోసారి ఏడు వికెట్ల ప్రదర్శన చేయడంతో అతడి ఫామ్‌పై క్రికెట్‌ వర్గాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా భారత టెస్ట్‌ జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్న ఆటగాళ్లలో కోటియన్‌ పేరు మళ్లీ వినిపిస్తోంది.

ఈ మ్యాచ్‌లో ముంబై తొలుత 396 పరుగులు చేసింది. అనంతరం రైల్వేస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకే ఆలౌటైంది. దీంతో ముంబైకి 137 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ముంబై బ్యాటర్లు అంగ్‌క్రిష్‌ రఘువంశీ, దివ్యాన్ష్‌ సక్సేనా అర్ధశతకాలతో రాణించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 174/4 స్కోరుతో నిలిచి, మొత్తం 311 పరుగుల ఆధిక్యంలో ఉంది.

కోటియన్‌ బౌలింగ్‌లో కేవలం వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టిన విధానం కూడా విశేషం. క్రీజ్‌ను ఉపయోగించుకోవడం, బంతి కోణాన్ని మార్చడం, నేరుగా వచ్చే బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం తన విజయానికి కారణమని ఆయన వెల్లడించాడు. ఇలాంటి ప్రదర్శన కొనసాగితే భవిష్యత్తులో జాతీయ జట్టులో అవకాశం దక్కుతుందా అన్న ఆసక్తి పెరుగుతోంది.

Next Story