Team India: టీమిండియా దెబ్బకు కివీస్ గడ్డపై టికెట్ల సునామీ..50 వేల టికెట్లు సేల్
50 వేల టికెట్లు సేల్

Team India: విదేశాల్లో టీమిండియా క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ ఆడినా నీలి జెర్సీల హోరే. సరిగ్గా ఇదే జోరు ఇప్పుడు కివీస్ గడ్డపై కూడా కనిపిస్తోంది! భారత్, న్యూజిలాండ్ మధ్య జరగబోయే వైట్-బాల్, రెడ్-బాల్ సమరం కోసం కివీస్ ల్యాండ్‌లో టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. సరిగ్గా రెండు వారాల కిందట ఓపెన్ అయిన టికెట్ సేల్స్.. ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తున్నాయి!
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ హోమ్ సమ్మర్ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు ఏకంగా 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడైపోయాయి! ఇందులో అసలు మ్యాజిక్ అంతా టీమిండియా పర్యటనదేనని స్వయంగా కివీస్ బోర్డే అంటోంది. గత ఆరు సంవత్సరాల కాలం తర్వాత టీమిండియా పూర్తి స్థాయి పర్యటన కోసం కివీస్ వెళ్తుండటంతో, అక్కడి క్రికెట్ ప్రేమికుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది.
అక్టోబర్ 22 నుంచి మొదలుకాబోయే ఈ టూర్‌లో భారత్.. 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లను ఆడనుంది. ఇక టికెట్ల డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే.. కేవలం ప్రీ-సేల్ విండో ప్రారంభమైన తొలి 48 గంటల్లోనే సుమారు 26 వేల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి! ఇక పబ్లిక్ సేల్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ జోరు మరింత పెరిగింది.
అక్టోబర్ 24న క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌కు సంబంధించి ఏకంగా 75 శాతం టికెట్లు ఇప్పటికే హాఫ్-అండ్-ఫుల్ అయిపోయాయి. అంతేకాదు వ్యూవర్స్.. ఆక్లాండ్‌లోని చారిత్రాత్మక ఈడెన్ పార్క్ స్టేడియంలో జరగబోయే నాలుగో టీ20 మ్యాచ్ కోసం కివీస్ బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో భారత్ పర్యటించిన తర్వాత మళ్లీ ఎన్నడూ తెరవని స్టేడియం ఆరో అంచె (Sixth Tier) సీటింగ్‌ను.. ఇప్పుడు ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా ఓపెన్ చేస్తున్నారు! 2015 వన్డే వరల్డ్ కప్, 2018 ఆస్ట్రేలియా మ్యాచుల సమయంలో మాత్రమే తెరిచిన ఈ టాప్ లెవెల్ సీటింగ్‌ను.. మళ్లీ ఇప్పుడు భారత్ మ్యాచ్ కోసమే ఓపెన్ చేయడం విశేషం.
ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు తర్వాత, ఈ రెండు జట్లు తలపడుతుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. రాబోయే అక్టోబర్, నవంబర్ నెలల్లో న్యూజిలాండ్ గడ్డపై కివీస్ - భారత్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌లు స్టేడియాలను హోరెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది!

