T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా రికార్డ్ విక్టరీ..
టీమిండియా రికార్డ్ విక్టరీ..

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్‌లో భాగంగా ఫిబ్రవరి 12న ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో భారత్, నమీబియాపై 93 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా, తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. తను కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. హార్దిక్ పాండ్యా చివర్లో మెరుపులు మెరిపిస్తూ 28 బంతుల్లో 52 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి 8 బంతుల్లోనే 22 పరుగులు (3 సిక్సర్లు, 1 ఫోర్) చేసి మెరిశాడు.
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా, భారత బౌలర్ల ధాటికి 18.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నమీబియా తరపున లౌరెన్ స్టీన్‌క్యాంప్ (29) అత్యధిక పరుగులు చేశాడు. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ బౌలింగ్‌లో 4 వికెట్లు తీసి రాణించినప్పటికీ, బ్యాటింగ్‌లో తన జట్టును ఆదుకోలేకపోయాడు. వరుణ్ చక్రవర్తి తన 2 ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి నమీబియా నడ్డి విరిచాడు.
హార్దిక్ పాండ్యా & అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన (52 పరుగులు, 2 వికెట్లు) చేసిన హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
భారత్ తన తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 15న (ఆదివారం) తలపడనుంది.

