Historic Lord’s Test: ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరగబోయే చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలక ఓపెనర్‌గా మారిన ప్రతికా రావల్ మోకాలి గాయం కారణంగా ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు పూర్తిగా దూరమైంది. టాంటన్‌ వేదికగా ఇంగ్లాండ్ 'ఎ' జట్టుతో జరిగిన ఒక మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ప్రతికా రావల్ మోకాలికి తీవ్రమైన గాయమైంది. ఆ గాయానికి వైద్యులు కుట్లు (stitches) వేయడంతో, ఆమె కోలుకోవడానికి సమయం పడుతుందని, అందువల్ల ఈ చారిత్రాత్మక టెస్టులో ఆమె ఆడటం లేదని భారత జట్టు ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అధికారికంగా ధృవీకరించారు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక పాత్ర పోషించిన ప్రతికా.. ఇలాంటి పెద్ద మ్యాచ్‌కు ముందు దూరం కావడం జట్టును కలవరపెడుతోంది.

ఈ నేపథ్యంలో జాతీయ సెలక్షన్ కమిటీ ప్రతికా రావల్ స్థానంలో ప్రత్యామ్నాయంగా టాప్ ఆర్డర్ బ్యాటర్ ప్రియా పునియాను జట్టులోకి ఎంపిక చేసింది. ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఇండియా 'ఎ' జట్టుతో ఉన్న ప్రియా పునియా, వెంటనే ప్రధాన జట్టుతో చేరి నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. జూలై 10 (శుక్రవారం) నుండి లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రత్యేకం కానుంది. ఎందుకంటే 142 ఏళ్ల లార్డ్స్ క్రికెట్ చరిత్రలో ఇక్కడ జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించి నిరాశలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా, ఈ చారిత్రాత్మక టెస్టులో అద్భుత ప్రదర్శన చేసి మళ్లీ ఫామ్‌లోకి రావాలని పట్టుదలగా ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story