Tennis legend Novak Djokovic: జోకోవిచ్ సరికొత్త చరిత్ర..
సరికొత్త చరిత్ర..

Tennis legend Novak Djokovic: టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open 2026)లో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. మెల్‌బోర్న్ పార్క్‌లో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్ మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన పెడ్రో మార్టినెజ్‌పై విజయం సాధించడం ద్వారా ఆయన ఈ ఘనత సాధించారు.
జోకోవిచ్ 6-3, 6-2, 6-2తో వరుస సెట్లలో మార్టినెజ్‌ను చిత్తు చేశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో 100 విజయాలు పూర్తి చేసుకున్న రెండో పురుష క్రీడాకారుడిగా నిలిచారు (మొదటి వ్యక్తి రోజర్ ఫెడరర్ - 102 విజయాలు). మూడు వేర్వేరు గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌లలో (వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్) 100 కంటే ఎక్కువ విజయాలు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా జోకోవిచ్ ప్రపంచ రికార్డు సృష్టించారు.
ప్రస్తుతం 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో మార్గరెట్ కోర్ట్ సరసన ఉన్న జోకోవిచ్, ఈ టోర్నీ గెలిస్తే అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు (25) గెలిచిన ఆల్-టైమ్ నంబర్ 1 ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తారు.38 ఏళ్ల వయస్సులోనూ ఆయన చూపిస్తున్న ఫిట్‌నెస్ మరియు ఫామ్ టెన్నిస్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. రెండో రౌండ్‌లో ఇటలీకి చెందిన క్వాలిఫైయర్ ఫ్రాన్సిస్కో మేస్ట్రెల్లితో జోకోవిచ్ తలపడనున్నారు.విజయానంతరం జోకోవిచ్ మాట్లాడుతూ.. "వంద విజయాలు అనే పదం వినడానికి చాలా బాగుంది. ఈ కోర్టు నాకు సొంత ఇల్లు లాంటిది" అని ఆనందం వ్యక్తం చేశారు.

