Shoaib Akhtar: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మళ్లీ వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి క్రికెట్ వల్ల కాదు, ఇటీవల మరణించిన ఆయన పెద్దన్నయ్య 'షాహిద్ అక్తర్' అంత్యక్రియల (జనాజా) వివాదం వల్ల. ఇస్లామాబాద్‌లోని H-8 స్మశానవాటికలో జరిగిన ఈ అంత్యక్రియలకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఈ అంత్యక్రియల ప్రార్థనల్లో (నమాజ్-ఎ-జనాజా) నిషేధిత ఉగ్రవాద సంస్థ 'లష్కరే తోయిబా' (LeT), అలాగే దానికి అనుబంధంగా పనిచేసే రాజకీయ పార్టీ 'పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్' (PMML) కు చెందిన పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. PMML పార్టీ అధ్యక్షుడు ఇనామ్-ఉర్-రెహమాన్ కూడా ఈ అంత్యక్రియలకు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ వీడియోలను సదరు పార్టీకి చెందిన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనే షేర్ చేసినట్లు సమాచారం.

ఈ వివాదంలో పేరు వినిపిస్తున్న ఇనామ్-ఉర్-రెహమాన్.. ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హాఫిజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడని చెబుతుంటారు. అంతేకాదు, గతంలో కాశ్మీర్‌లోని పహల్గామ్ దాడికి మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న సైఫుల్లా కసూరీతో కలిసి ఇనామ్-ఉర్-రెహమాన్ దిగిన కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు మళ్లీ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే, అక్తర్ కుటుంబంలో జరిగిన ఈ విషాదంపై పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ సైతం స్పందించారు. ఆయన నేరుగా షోయబ్ అక్తర్ ఇంటికి వెళ్లి, షాహిద్ అక్తర్ మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

మళ్లీ మొదలైన అంతర్జాతీయ చర్చ:

ఒక ప్రముఖ క్రికెటర్ అన్న అంత్యక్రియల్లో ఇలాంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల నేతలు కనిపించడం పాకిస్తాన్‌లో పెద్ద చర్చకు దారితీసింది. పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని ఉగ్రవాద సంస్థలను పైకి నిషేధించినప్పటికీ, అవి వేరే పేర్లతో, రాజకీయ పార్టీల ముసుగులో దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయనే అంతర్జాతీయ ఆరోపణలకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూర్చినట్లయింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story