Rohit Sharma Makes Key Comments: ఆ ఓటమి నన్ను విడదీసింది.. రోహిత్ శర్మ కీలక కామెంట్స్
రోహిత్ శర్మ కీలక కామెంట్స్

Rohit Sharma Makes Key Comments: టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన క్రికెట్ కెరీర్‌కు సంబంధించి ఒక కీలకమైన విషయాన్ని వెల్లడించారు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమి తర్వాత, తాను క్రికెట్ నుంచి అకాల రిటైర్మెంట్ తీసుకోవాలని తీవ్రంగా ఆలోచించినట్లు ఆయన తెలిపారు. గుర్గావ్‌లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్, ఆనాటి తన మానసిక స్థితిని వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్ తన జీవితంలో అత్యంత కఠినమైన కాలమని రోహిత్ పేర్కొన్నారు. "ఆ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టమైంది. నా శరీరంలోని శక్తి అంతా హరించుకుపోయినట్లు అనిపించింది. అసలు మళ్లీ క్రికెట్ ఆడాలా? లేక ఇక్కడితో ఆపేసి రిటైర్మెంట్ తీసుకోవాలా? అని ఒకానొక సమయంలో ఆలోచించాను" అని ఆయన తన మనసులోని బాధను పంచుకున్నారు. ప్రపంచకప్ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, తన కల ముక్కలైనప్పుడు పూర్తిగా విరిగిపోయానని చెప్పారు. అదృష్టవశాత్తూ ఆ నిర్ణయం తీసుకోకుండా తనను తాను మానసికంగా సిద్ధం చేసుకున్నారు. "జీవితం ఇక్కడితో ముగిసిపోదు, ఏదో ఒక కొత్త ఆరంభం ఉంటుందని నాకు నేను సర్దిచెప్పుకున్నాను" అని రోహిత్ అన్నారు. ఆ పట్టుదలే భారత్‌కు రెండు ప్రతిష్టాత్మక ఐసీసీ ట్రోఫీలను అందించింది. ప్రస్తుతం రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లు , టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్‌కు, 2025 మే నెలలో టెస్ట్ క్రికెట్‌కు ఆయన వీడ్కోలు పలికారు. అంతేకాకుండా, ఈ ఏడాది ఆరంభంలో వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. అయితే, బ్యాటర్‌గా వన్డే ఫార్మాట్‌లో మాత్రం ఆయన కొనసాగుతున్నారు. తన చిరకాల వాంఛ అయిన వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడడమే లక్ష్యంగా 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడాలని రోహిత్ భావిస్తున్నారు.

