Mohammad Kaif’s Sensational Remarks on Team India: అలాగైతే వరల్డ్ కప్ గెలవడం కష్టమే..టీమిండియాపై మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు..
టీమిండియాపై మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు..

Mohammad Kaif’s Sensational Remarks on Team India: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలవ్వడంపై మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా సాగాలంటే జట్టులో మార్పులు అవసరమని ఆయన సూచించారు. వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కన పెట్టి ప్రసిద్ధ్ కృష్ణను ఆడించడాన్ని కైఫ్ తప్పుబట్టారు. ప్రసిద్ధ్ కృష్ణ ధారాళంగా పరుగులు ఇస్తాడని, కీలక సమయంలో వికెట్లు తీసే అర్ష్‌దీప్ జట్టులో ఉండాలని అభిప్రాయపడ్డారు.
"280 పరుగులు తక్కువ కాబట్టే ఓడిపోయాం అంటే.. మనం వరల్డ్ కప్ గెలవలేం" అని కైఫ్ వ్యాఖ్యానించారు. 270-280 వంటి మోస్తరు స్కోర్లను కూడా డిఫెండ్ చేసుకుని గెలవడం టీమ్ ఇండియా నేర్చుకోవాలని హితవు పలికారు. మైదానంలో మంచు ఉందా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా బౌలింగ్ చేయడంపై బౌలర్లు దృష్టి పెట్టాలని సూచించారు.
నిర్ణయాత్మక మూడో వన్డేపై ఉత్కంఠ
సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డే ఆదివారం ఇందౌర్ వేదికగా జరగనుంది. కైఫ్ సూచనల నేపథ్యంలో రేపటి మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది. సిరీస్ సొంతం చేసుకోవాలంటే భారత బౌలర్లు ఖచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే.

