Gautam Gambhir: ఫలితం ఏదైనా, వేదిక ఏదైనా సరే.. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ శైలి. విమర్శలను తిప్పికొట్టడమైనా, జట్టు ప్రదర్శనను సమర్థించడమైనా ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గరు. న్యూజిలాండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ గంభీర్ మార్క్ వైఖరి స్పష్టంగా కనిపించింది. చివరి మ్యాచ్‌లో ఓడినప్పటికీ సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకున్న అనంతరం గంభీర్ జట్టు పోరాట పటిమను కొనియాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఒక్క రోజు సన్నాహంతోనే అద్భుత విజయం

హామిల్టన్‌లో జరిగిన ఆఖరి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైనప్పటికీ, అంతకుముందే మొదటి మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయం ఎందుకు ప్రత్యేకమైనదో వివరిస్తూ గంభీర్ ఇలా అన్నారు. "ఈ విజయం నిజంగా అద్భుతం. ఎందుకంటే ఆటగాళ్లకు సన్నద్ధం కావడానికి కేవలం ఒక్క రోజే సమయం లభించింది. విండీస్ పర్యటన ముగించుకుని 20వ తేదీన ఇక్కడికి చేరుకుని, 21న నెట్స్ ప్రాక్టీస్ చేసి వెంటనే బరిలోకి దిగారు. పూర్తి భిన్నమైన పరిస్థితులు, భిన్నమైన వాతావరణం, విభిన్న మైదానాలు. పైగా టీ20ల్లో అపార అనుభవమున్న న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపైనే ఢీకొట్టడం సాధారణ విషయం కాదు. జట్టులోని చాలామంది ఆటగాళ్లకు ఇది తొలి కివీస్ పర్యటన. ఇంత తక్కువ సమయంలో జట్టు చూపించిన ప్రతిభను చూసి ప్రతీ ఒక్కరూ గర్వపడాలి" అని అన్నారు.

భయం అనే పదానికి నా జీవితంలో చోటు లేదు!

ఇంత తక్కువ వ్యవధిలో పరిస్థితులకు అలవాటు పడే క్రమంలో జట్టులో ఏమైనా భయం లేదా ఆందోళన ఉందా అని అడిగిన ప్రశ్నకు గంభీర్ తనదైన దూకుడుతో సమాధానమిచ్చారు. "నేను దేనికీ భయపడను. నా నిఘంటువులో, నా సిద్ధాంతాల్లో 'భయం' అనే మాటే ఉండదు. అసలు నా జీవితంలో దానికి ఉనికిలోనే స్థానం లేదు" అంటూ ప్రత్యర్థులకు స్పష్టమైన సందేశమిచ్చారు. వెస్టిండీస్ పర్యటన ముగిసిన వెంటనే న్యూజిలాండ్ వచ్చి, సరైన విశ్రాంతి లేకపోయినా సిరీస్‌ను ఒడిసిపట్టిన భారత యువ జట్టు పోరాట స్ఫూర్తిపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది.

Next Story