సుందర్‌పై గంగూలీ కీలక వ్యాఖ్యలు

Ganguly’s Key Remarks on Sundar: టీమిండియా దిగ్గజం, ప్రస్తుత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో జరిగిన టెస్టులో టీమ్ ఇండియా ఓటమి నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. కోల్‌కతా టెస్టులో వాషింగ్టన్ సుందర్ మూడో స్థానంలో వచ్చి 29 (మొదటి ఇన్నింగ్స్‌లో), 31 (రెండో ఇన్నింగ్స్‌లో) పరుగులు చేసినప్పటికీ, ఈ నిర్ణయం సరైంది కాదని గంగూలీ అభిప్రాయపడ్డారు. "వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు మంచి క్రికెటర్. చక్కగా బౌలింగ్‌ వేయగలడు, అద్భుతంగా బ్యాటింగ్‌ చేయగలడు. కానీ.. టెస్ట్‌ క్రికెట్‌లో మూడో స్థానం అతడికి సరిపోదు." అని అన్నారు.

సౌరభ్ గంగూలీ ప్రకారం.. టెస్ట్ క్రికెట్‌లో మొదటి ఐదుగురు బ్యాటర్లు కచ్చితంగా స్పెషలిస్ట్‌లే ఉండాలి. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో సుందర్ మూడో స్థానంలో ఆడటం సరిపోదని ఆయన సూచించారు. ఈ విషయంలో టీమ్‌ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ దృష్టిసారించాలని గంగూలీ కోరారు.

నలుగురు స్పిన్నర్లు అవసరం లేదు

జట్టు కూర్పుపై కూడా గంగూలీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వదేశంలో ఆడుతున్నప్పుడు జట్టులో నలుగురు స్పిన్నర్లు అవసరం లేదని ఆయన అన్నారు. "కోల్‌కతా టెస్ట్‌లో వాషింగ్టన్ సుందర్ కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్‌ వేశాడు. అలాంటప్పుడు నలుగురు స్పిన్నర్లను తీసుకోవాల్సిన అవసరం లేదు. పిచ్‌లో టర్న్‌ ఉంటే, ప్రధాన బౌలర్లు 20 నుంచి 30 ఓవర్లు బౌలింగ్‌ వేయగలరు. అందుకే నాలుగో స్పిన్నర్ అవసరం లేదు" అని గంగూలీ అన్నారు

PolitEnt Media

PolitEnt Media

Next Story