ట్రావిస్ హెడ్ సరికొత్త రికార్డు

Travis Head: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో అద్భుత శతకంతో చెలరేగిన హెడ్, దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడన్ రికార్డును సమం చేశాడు. మంగళవారం (జనవరి 6, 2026) జరిగిన ఐదో టెస్ట్ మూడో రోజు ఆటలో ట్రావిస్ హెడ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ సిరీస్‌లో మూడవ సెంచరీని నమోదు చేశాడు. తద్వారా ఒకే యాషెస్ సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్‌గా మాథ్యూ హేడన్ పేరిట ఉన్న రికార్డును ఆయన సమం చేశాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో హెడ్ మూడు సెంచరీలు సాధించడం విశేషం.

ఒక యాషెస్ సిరీస్‌లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన ఆస్ట్రేలియా ఓపెనర్ల జాబితాలో హెడ్ చేరిపోయాడు. మాథ్యూ హేడన్ 2002-03 యాషెస్ సిరీస్‌లో హేడన్ మూడు శతకాలు బాదాడు. హెడ్ కంటే ముందు జో డార్లింగ్ (1897-98), బిల్ వుడ్‌ఫుల్ (1928-29), ఆర్థర్ మోరిస్ (1946-47, 1948), బిల్ లారీ (1965-66), మైఖేల్ స్లేటర్ (1994-95, 1998-99) మాత్రమే ఆసీస్ తరఫున ఓపెనర్లుగా ఈ ఘనత సాధించారు. యాషెస్ చరిత్రలో ఒకే సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఏకైక ఓపెనర్ రికార్డు ఇంగ్లాండ్ దిగ్గజం హెర్బర్ట్ సట్‌క్లిఫ్ (1924-25) పేరిట ఉంది.

నిజానికి ఈ సిరీస్‌కు ట్రావిస్ హెడ్ మొదటి ఎంపిక ఓపెనర్ కాదు. అయితే, పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా ఓపెనింగ్‌కు రాకపోవడంతో ఆ బాధ్యతను హెడ్ తీసుకున్నాడు. కేవలం 69 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాది ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించడమే కాకుండా, సిరీస్ మొత్తం ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సిడ్నీ టెస్టులో హెడ్ 166 బంతుల్లో 163 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో 24 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌తో ఆయన ఈ సిరీస్‌లో 600 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story