Tri-Series: ముక్కోణపు వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియా A అదరగొట్టింది. దంబుల్లా వేదికగా శ్రీలంక Aతో జరిగిన హై-ఓల్టేజ్ మ్యాచ్‌లో మన కుర్రాళ్లు అద్భుత విజయాన్ని అందుకున్నారు. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ పోరులో... శ్రీలంకపై 8 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. సెంచరీతో కదం తొక్కిన రుతురాజ్ గైక్వాడ్ టీమ్ ఇండియా విజయానికి బలమైన పునాది వేశాడు.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 14 పరుగులకే నిరాశపరిచాడు. అయితే ఆ తర్వాత కెప్టెన్ తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను అద్భుతంగా చక్కదిద్దారు. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులతో అద్భుత శతకాన్ని బాదగా... కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులతో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో షెడ్గే కేవలం 14 బంతుల్లోనే ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 26 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో... భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బౌలర్లలో షిరాజ్ రెండు వికెట్లు తీశాడు.

ఇక 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక A గట్టి పోటీ ఇచ్చింది. సహన్ 74 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి భారత్‌కు ముచ్చెమటలు పట్టించాడు. అతనికి తోడుగా నిరోషన్ 47, సదీరా 46, అవిష్క 45 పరుగులతో రాణించడంతో లంక విజయానికి చేరువైంది. కానీ, కీలక సమయంలో భారత బౌలర్లు కట్టడి చేశారు. లంక టాప్ ఆర్డర్ రాణించినా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో మ్యాచ్ ఒక్కసారిగా భారత్ వైపు తిరిగింది.

భారత బౌలర్లలో అర్షద్, అనుకుల్, ఆయుష్, విప్రజ్ పోటీపడి మరీ తలో రెండు వికెట్లు పడగొట్టగా, అంశుల్ ఒక వికెట్ సాధించాడు. ముఖ్యంగా అర్షద్ వేసిన చివరి ఓవర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆ ఉత్కంఠభరితమైన ఆఖరి ఓవర్లోనే లంకకు చెందిన మూడు వికెట్లు పడటంతో... 48.5 ఓవర్లలో 269 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయ్యింది. చివర్లో షిరాజ్ 23 పరుగుల వద్ద రనౌట్ కావడంతో భారత్ విజయం ఖాయమైంది.భారీ సెంచరీతో భారత్‌ను గెలిపించిన రుతురాజ్ గైక్వాడ్‌కే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story